రాజకీయ ఉద్రిక్తతల కారణంగా.. భారత్- పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్ జరగక దశాబ్దం దాటిపోయింది. చివరిసారి 5 వన్డేలు, 3 టెస్టుల ఆడేందుకు 2007లో పాకిస్థాన్, భారత పర్యటనకు వచ్చింది. అదే టూర్లో.. సచిన్ తెందుల్కర్‌తో జరిగిన ఓ సరదా సన్నివేశం గురించి ఇప్పుడు చెప్పాడు పాకిస్థాన్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్. అయితే అవార్డుల కార్యక్రమంలో సచిన్‌తో ప్రాంక్ చేసిన అక్తర్‌కు దిమ్మతిరిగిపోయిందట. ఆ పని వల్ల తనకు భారత్ వీసా రాకపోయేదని, భారతీయులు చంపేసేవారని అనుకున్నట్లు తాజాగా గుర్తు చేసుకున్నాడు. సచిన్‌ను కిందపడేయడమే దీనికి కారణం. ఇంతకీ ఏం జరిగిందో.. అక్తర్ మాటల్లోనే..
''పాకిస్థాన్ తర్వాత.. నేను ఎక్కువమంది అభిమానుల్ని సంపాదించుకుంది ఇండియా నుంచే. భారత పర్యటనల్లో నాకు ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. 2007 పర్యటన సందర్భంగా.. అవార్డుల కార్యక్రమంలో ఏదో విభిన్నంగా చేయాలనుకుని సచిన్‌ను ఎత్తుకోవాలనుకున్నా.
ఎలాగోలా సచిన్‌ను ఎత్తుకున్నా .. కానీ అతడు నా చేతుల్లోంచి జారిపోయాడు. సచిన్ కిందపడిపోయాక.. నేను చనిపోయాన్రా అనుకున్నా. సచిన్‌కు ఒకవేళ గాయమైతే.. నాకు ఇక భారత్ వీసా రాదని భయపడిపోయా. అభిమానులు నన్ను మళ్లీ భారత్‌కు రానిచ్చేవారు కాదు లేదా సజీవదహనం చేసేవారనుకున్నా''
- షోయబ్ అక్తర్, పాక్ మాజీ క్రికెటర్
పాకిస్థాన్ తరఫున 46 టెస్టులాడిన అక్తర్.. 178 వికెట్లు తీశాడు. 163 వన్డేల్లో 247, 15 టీ-20ల్లో 19 వికెట్ల చొప్పున తీశాడు. ఆ దేశ దిగ్గజ బౌలర్లలో అక్తర్ ముందు వరుసలో ఉంటాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత.. సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న అక్తర్.. తరచూ క్రికెట్ గురించి మాట్లాడుతుంటాడు. ఈ క్రమంలోనే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు.
ఇదీ చూడండి: ఐసీసీ నిద్రపోతుందా?.. ఇంజమామ్ ఆగ్రహం!