ICC ODI World Cup 2023 IND Vs PAK : క్రికెట్ లవర్స్‌లో ఎంతో ఉత్కంఠ రేపే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్లో మార్పులు జరిగాయి. ఐసీసీ తుది షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌ను ఒక్క రోజు ముందు జరగనుంది. ఈ క్రమంలో అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఆయా జట్ల అభ్యర్థనలతో పాటు భద్రతా ఇబ్బందుల దృష్ట్యా కొన్ని మ్యాచ్‌లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రీషెడ్యూల్ చేసింది. అందులో భాగంగానే ఈ మ్యాచ్ తేదీలోనూ మార్పు వచ్చింది. భారత్- పాక్ మ్యాచ్ డేట్ మార్పు విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ప్రముఖ ఆంగ్ల వెబ్సైట్లు చెబుతున్నాయి.
Ind Vs Pakistan ICC Schedule : అయితే అప్పట్లో తుది షెడ్యూల్‌ను చూసిన అభిమానులు.. ఇక దాదాపు అవే తేదీలు ఫిక్స్ అవుతాయని అనుకున్నారు. దీంతో దేశ విదేశాల నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లి మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ అక్కడి హోటల్స్ అన్నింటినీ అడ్వాన్స్ బుక్కింగ్స్తో హౌస్‌ఫుల్ చేసేశారు. దీంతో మ్యాచ్ జరిగే రోజుతో పాటు అంతకుముందు రోజులకు కూడా హోటల్స్ రేట్స్ భారీగా పెరిగాయి. ఇదే అదనుగా చేసుకున్న హోటల్ యజమానులు రోజుకు రూ.30 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకొన్ని స్టార్ హోటల్స్ అయితే ఒక రోజుకు రూమ్ అద్దె రూ. లక్షకు చేరుకుందని సమాచారం.
Ind Vs Pakistan Room Rents : ఇంతే కాదు రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయని కొందరు ఫ్యాన్స్ ఏకంగా స్టేడియం దగ్గరగా ఉన్న హాస్పిటల్స్‌లోని రూమ్స్ కోసం ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇక ఆ హాస్పిటల్స్‌లోని రూమ్స్ ధర కూడా రూ. 3 వేల నుంచి 25 వేల వరకు పలుకుతోందట. ఇక షెడ్యూల్ మార్పుల సమాచారంతో అభిమానులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇంతటి భారీ ధరలతో తాము చేసుకున్న బుకింగ్స్ గురించి ఆలోచిస్తూ తికమకలో పడిపోయారు. బీసీసీఐ ఇలా చేస్తుందని ఊహించలేదని కొందరు వాపోతుంటే.. మరికొందరేమో మేము అప్పుడే అనుకున్నాం ఇలాంటిది ఏదో జరుగుతుందని అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ ఇప్పడున్న పరిస్థితిలో హోటల్ యాజమాన్యంతో పాటు అడ్వాన్స్ బుక్కింగ్స్ చేసుకున్న అభిమానుల రియాక్షన్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు