WTC Final 2023 Rohith Sharma : టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లోనూ అంతగా ఆకట్టుకోని హిట్‌మ్యాన్.. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ అదే తీరును కొనసాగించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో 15 పరుగులు చేసిన రోహిత్ ఔటయ్యాడు. ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే ఇన్నింగ్స్‌ను కాస్త దూకుడుగానే ఆరంభించిన రోహిత్.. కంటిన్యూ చేయలేక చతికలపడ్డాడు.
ఐసీసీ నాకౌట్స్‌లోనూ రోహిత్ శర్మ మంచి రికార్డు లేదు. ఇప్పటివరకు 12 సందర్భాల్లో ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ రెండు సెంచరీలు మినహా మిగతా 10సార్లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. అయితే రోహిత్ శర్మ పేలవ ఫామ్‌పై అభిమానులు మండిపడ్డారు. ''ఒక కెప్టెన్ అయ్యుండి బాధ్యతగా ఆడాల్సిన విషయం గుర్తులేదా?', .ఐసీసీ టైటిల్ కొట్టే చాన్స్ వచ్చింది.. సద్వినియోగం చేసుకోవాలి కాని చెడగొట్టొద్దు', 'కెప్టెన్‌గా విఫలమయ్యావు.. ఫీల్డింగ్ చేయలేవు.. బ్యాటింగ్ చేయలేవు.. ' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా కష్టాల్లో పడింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ(15), శుభ్‌మన్ గిల్(13) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా(14), విరాట్ కోహ్లీ(14) కూడా నిరాశపరిచారు. ప్రస్తుతం క్రీజులో అజింక్య రహానే, పుజారా ఉన్నారు.
అంతకుముందు.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 327/3తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. భారత్ బౌలర్లు పుంజుకోవడంతో మరో 142 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (163; 174 బంతుల్లో 25 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు సెంచరీ చేయగా.. స్టీవ్ స్మిత్ (121; 268 బంతుల్లో 19 ఫోర్లు) నిలకడగా ఆడి శతకం సాధించాడు. అలెక్స్ కేరీ (48; 69 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ వార్నర్ (43; 60 బంతుల్లో 8 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో సిరాజ్ 4, శార్దూల్ ఠాకూర్ 2, షమి 2, జడేజా ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
ట్రావిస్ హెడ్ (146), స్మిత్ (95) స్కోర్లతో రెండో ఆటను కొనసాగించారు. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సిరాజ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం షమి బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ ఫోర్ కొట్టి 150 మార్క్ దాటాడు. భారీ స్కోరు దిశగా సాగుతున్న హెడ్‌ను సిరాజ్ ఔట్ చేశాడు. హెడ్ వికెట్ కీపర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్ (6) షమి బౌలింగ్‌లో స్లిప్‌లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చాడు.
స్మిత్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ (5)ను సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ అక్షర్ పటేల్ అద్భుతమై త్రోతో రనౌట్ చేశాడు. ఈ క్రమంలో భోజన విరామ సమయానికి ఆసీస్ 422/7తో నిలిచింది. లంచ్ బ్రేక్ తర్వాత కేరీ దూకుడు పెంచాడు. షమి బౌలింగ్‌లో మూడు ఫోర్లు బాదాడు. జడేజా వేసిన 115 ఓవర్‌లో మూడో బంతికి సిక్స్ బాదిన కేరీ.. తర్వాతి బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. తొలుత అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. భారత్ డీఆర్‌ఎస్‌కు వెళ్లి ఫలితం రాబట్టింది. సిరాజ్ బౌలింగ్‌లో నాథన్ లైయన్ (9) క్లీన్‌బౌల్డ్ అవ్వగా.. కమిన్స్ (9) రహానెకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఆసీస్ ఆలౌటైంది.