బీసీసీఐ పురుషుల సీనియర్ జట్టు సెలెక్టర్ల పదవి కోసం చాలా దరఖాస్తులు వచ్చాయి. దాదాపుగా 600 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ దరఖాస్తులను స్క్రూట్నీ చేసే సమయంలో కొన్ని సీవీలను చూసి అధికారులు షాకయ్యారు. క్రికెట్ మాజీ దిగ్గజాలు సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లతో పాటు టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పేర్లతో దరఖాస్తులు వచ్చాయి. అంతేకాదు.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ పేరుతోనూ ఓ దరఖాస్తు వచ్చింది. అయితే, ఇవన్నీ కొందరు ఆకతాయిలు నకిలీ ఈ-మెయిల్ ఐడీలతో పంపించినట్లు అధికారులు గుర్తించారు. బీసీసీఐ సమయాన్ని వృథా చేసేందుకు కొందరు ఆకతాయిలు ఈ పని చేసినట్టు క్రికెట్ మండలి వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అయితే ఐదు పదవుల కోసం 10 మందిని షార్ట్‌లిస్ట్ చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తికానుందని అధికారులు తెలిపారు.
కాగా, టీ20 ప్రపంచకప్ మెగా సమరంలో టీమ్‌ఇండియా సెమీస్ నుంచి నిష్క్రమించిన తర్వాత చేతన్ శర్మ నేత్వత్వంలోని సెలెక్షన్ కమిటీని బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే. అయితే, కొత్త సెలెక్టర్లను నియమించేంత వరకు ప్రస్తుత ప్యానెలే విధులు కొనసాగించనుంది. కొత్త ప్యానెల్ కోసం మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మనిందర్ సింగ్, మాజీ ఓపెనర్ శివ్‌సుందర్ దాస్, వినోద్ కాంబ్లి దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.