ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు జట్టులో మార్పులు చేయాలని టీమ్ఇండియా భావిస్తుంది! రిషభ్ పంత్(Rishab Pant) స్థానంలో కేఎల్ రాహుల్ లేదా వృద్ధిమాన్ సాహాను(KL Rahul or Wriddhiman Saha) తీసుకోవాలని అనుకుంటోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో పంత్ అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో అతడిపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో రాహుల్ లేదా సాహాను తీసుకోనున్నారని ఊహాగానాలు ఊపందుకున్నాయి.
తొలి ప్రాధాన్యం కేఎల్ రాహుల్?
కేఎల్ రాహుల్‌కు తొలి ప్రాధాన్యత దక్కకపోవచ్చు. ఎందుకంటే చివరిసారిగా అతడు 2019లో వెస్టిండీస్‌పై ఆడాడు. ఆ సిరీస్‌లో భారత్ 2-0తేడాతో గెలిచినప్పటికీ రాహుల్ ఆకట్టుకోలేకపోయాడు. ఒకవేళ అతడిని వికెట్‌కీపర్‌గా తీసుకుంటే ఓ ఆల్‌రౌండర్‌ను తీసేయాల్సి వస్తుంది. మరోవైపు గాయంతో గిల్ సిరీస్‌కు దూరమయ్యాడు. కాబ్టటి అతడి స్థానంలో ఓపెనర్‌గానైనా వచ్చే అవకాశముంది.
సాహా సరైనోడా?
పంత్‌లా దూకుడుగా ఆడకపోయినప్పటికీ వికెట్‌కీపర్‌గా మంచి ప్రదర్శన చేయగలడు! చివరిసారిగా 2020లో రెండు టెస్టులు ఆడాడు. ఇంగ్లాండ్‌లో బంతి స్వింగ్ అవ్వడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి సాహా తీసుకుంటే కలిసొచ్చే అవకాశం ఉంది. భారత జట్టు నలుగురు పేసర్లతో ఆడుతుంది. కనుక స్టంప్స్ వెనుక ఉండే బాధ్యతను అతడికే అప్పగించడం టీమ్‌కు అనుకూలం. పంత్‌కు విశ్రాంతి ఇవ్వడం వల్ల తన ఆటను మరింత మెరుగుపరుచుకోవడానికి అతడికి అవకాశం దొరుకుతుంది.
పంత్ గురించి కోహ్లీ
"పంత్ సానుకూల, ఆశావాహ దృక్ఫథాన్ని కోల్పోవాలని మేం అనుకోవడం లేదు. దాని గురించి పెద్దగా చింతించడం లేదు. అవగాహన లోపం వల్ల ఇలా జరుగుతుందా అనే విషయాన్ని గుర్తించి, చక్కదిద్దుకునే బాధ్యత అతడిదే. అవకాశం వచ్చినప్పుడల్లా తనను తాను నిరూపించుకునే ఆటగాడిగా పంత్ ఎదుగుతున్నాడు. పరిస్థితులను త్వరగా అర్థం చేసుకుంటాడు. ఒక్కోసారి ఫలితం సరిగా రాలేదంటే.. అందరూ అవగాహన లోపం అని అంటుంటారు. అయితే క్రీడల్లో ఇది సాధారణమే" అని ఇటీవల ఓ ఇంటర్వూలో పంత్ గురించి కోహ్లీ(Kohli) ఇలా అన్నాడు.
ఇదీ చూడండి: 'పంత్ కూడా సెహ్వాగ్, గిల్‌క్రిస్ట్ లాంటివాడే'