ECB India Pakistan Test : భారత్-పాక్ టీ20 సిరీస్ నిర్వహిస్తామన్న ఇంగ్లాడ్ క్రికెట్ బోర్డు ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. ఇటీవల ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.. ఇరు దేశాల మధ్య సిరీస్‌ను తమ దేశంలో నిర్వహిస్తామని ఆఫర్ చేసింది. దీనిపై స్పందించిన బీసీసీఐ టోర్నీల్లోనే భారత్-పాక్ మ్యాచ్‌లు ఉంటాయని స్పష్టం చేసింది.
అయితే గత దశాబ్ద కాలంగా ఈ చిరకాల ప్రత్యర్థులు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. కేవలం ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్, ఆసియా కప్‌లలో మాత్రమే తలపడ్డాయి. చివరిసారిగా 2012లో దైపాక్షిక్ సిరీస్ ఆడాయి. రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సిరీస్‌లు నిర్వహించడం సాధ్య పడలేదు. అయితే ఈ విషయంపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డును సంప్రదించింది. దీనిపై స్పందించిన బీసీసీఐ అధికారి.. ఈసీబీ ప్రవర్తన వింతగా ఉందని చెప్పారు.
"భారత్, పాక్ సిరీస్ కోసం పీసీబీతో ఇంగ్లాండ్ మాట్లాడడమే విచిత్రంగా ఉంది. పాక్‌తో సిరీస్‌పై నిర్ణయం బీసీసీఐ చేతుల్లో కూడా లేదు. అది భారత ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ప్రస్తుతానికి పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఐసీసీ టోర్నీల్లోనే పాక్‌తో తలపడతాం’’ అని ఓ సీనియర్ బీసీసీఐ అధికారి చెప్పాడు
అయితే అంతకముందే తమ దేశంలో భారత్, పాక్ మధ్య టెస్ట్ సిరీస్ నిర్వహిస్తామని ఈసీబీ డిప్యూటీ ఛైర్మన్ మార్టిన్ డార్లో పీసీబీతో చెప్పారు. ఈ మేరకు యూకేకు చెందిన టెలిగ్రాఫ్ అనే వార్తా సంస్థ రిపోర్టు వెల్లడించింది. ఈ మ్యాచ్‌ల వల్ల గ్రౌండ్లకు భారీగా ప్రేక్షకులు వచ్చి ఈసీబీకి ఆదాయం వస్తుందని పేర్కొంది. స్పాన్సర్‌షిప్‌లతో పాటు టీవీ ప్రేక్షకులు కూడా భారీగానే ఉంటారని.. దీంతో ఆదాయం సమకూర్చుకునేందుకు ఈసీబీ ప్రయత్నాలు చేస్తోందని తెలిపింది. అయితే ఈ ఆఫర్‌ను పాకిస్థాన్ కూడా తిరస్కరించింది. ఈ అఫర్ పాకిస్థాన్, ఇంగ్లాండ్ బోర్డుల మధ్య పెరుగుతున్న సంబంధానికి నిదర్శణం అని పీసీబీ అభిప్రాయపడినట్లు రిపోర్టు పేర్కొంది. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో భారత్ రెండు సార్లు పాకిస్థాన్‌తో తలపడింది. ఆస్ట్రేలియాలో జరిగే వరల్డ్ కప్‌లో సూపర్ 4 స్టేజ్‌లో మరో సారి తలపడనుంది.
ఇవీ చదవండి: 'ఆ విషయంలో హార్దిక్ పాండ్యను మించిన వాళ్లు లేరు'