Rohith sharma England test: ఇంగ్లాండ్‌తో ఐదో టెస్ట్‌లో రోహిత్ శర్మ ఆడటం లేదని, అతని స్థానంలో బుమ్రా కెప్టెన్సీ వహిస్తాడని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. కరోనా బారిన పడిన హిట్‌మ్యాన్‌కు బుధవారం టెస్టు చేయగా మరోసారి పాజిటివ్‌గా వచ్చిందని, దీంతో అతడు మ్యాచ్ ఆడే అవకాశం లేదని చెప్పారు. అయితే తాజాగా కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం దీనిపై భిన్నంగా స్పందించాడు. రోహిత్ శర్మకు ఆడే ఛాన్స్ ఉందని, మ్యాచ్‌కు ఇంకా సమయం ఉందన్న విషయాన్ని గుర్తు చేశాడు.
"రోహిత్‌ను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అతడు ఇంకా మ్యాచ్ నుంచి తప్పుకోలేదు. మ్యాచ్ జరగడానికి ఇంకా సమయం ఉంది. మరోసారి పరీక్షలు నిర్వహిస్తాం. అప్పుడు హిట్‌మ్యాన్ విషయంలో మెడకల్ టీమ్, స్పోర్ట్స్ సైన్స్ తుది నిర్ణయం తీసుకుంటుంది" అని అన్నాడు. ఒకవేళ రోహిత్ ఆడకపోతే కెప్టెన్ ఎవరుంటారు అన్న ప్రశ్నకు.. దీనిపై సెలెక్టర్ల నుంచి అధికార ప్రకటన వస్తుందని అన్నాడు. కాగా, ఈ సమాధానాలతో రోహిత్ ఆడతాడా లేదా అన్న విషయంపై అభిమానులు సందిగ్ధంలో పడ్డారు. అతడు త్వరగా కోలుకోవాలని, మ్యాచ్ ఆడాలని ప్రార్థిస్తున్నారు.
ఈ మధ్య వివిధ కారణాల వల్ల టీమ్ఇండియాకు కెప్టెన్లు మారాల్సి వచ్చింది. దీనిపై స్పందిస్తూ.. "నేను బాధ్యతలు చేపట్టినప్పుడు ఇంతమంది కెప్టెన్లతో పని చేయాల్సి వస్తుందని అనుకోలేదు. కానీ దురదృష్టవశాత్తూ గాయాలయ్యాయి. కొన్నిసార్లు ప్లేయర్స్‌పై పని భారం తగ్గించాల్సి వచ్చింది. సారథులు మారతారని ఊహించలేం కానీ.. మారినప్పుడు అందుకు తగినట్లు స్పందించి వాళ్లకు తగిన వ్యూహాలు రచించాల్సి ఉంటుంది" అని ద్రవిడ్ చెప్పాడు.
ఇదీ చూడండి: కోహ్లీ ఫామ్‌లో లేకపోవడానికి కారణం అది కాదు: ద్రవిడ్