Dilip Vengsarkar BCCI : వన్డే వరల్డ్‌కప్ 1983 విన్నింగ్ జట్టు సభ్యుడు, బీసీసీఐ మాజీ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు అని చెప్పుకోవడం కాదని.. కొంచెం భవిష్యత్ మీద కూడా దృష్టి పెట్టాలన్నాడు. గత కొన్నేళ్లుగా సెలక్టర్లుగా ఉన్నవారికి విజన్ లేదని.. రోహిత్ శర్మ తర్వాత సారథిని తయారు చేయడంలో సెలక్టర్లు విఫలమయ్యారని మండిపడ్డాడు. ఈ మేరకు ఓ ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
"దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, గత 6-7 ఏళ్లుగా నేను చూసిన సెలెక్టర్లకు ఆటపై విజన్, లోతైన పరిజ్ఞానం, క్రికెటింగ్ సెన్స్ లేదు. ఒకే సమయంలో రెండు పర్యటనలు ఉన్నప్పుడు.. శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌ను చేశారు. సీనియర్ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు శ్రీలంక పర్యటనకు ధావన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. అలాంటి పరిస్థితుల్లోనే భవిష్యత్తు సారథిని తీర్చిదిద్దుకునే అవకాశం వస్తుంది. కానీ, మీరు (బీసీసీఐ సెలెక్టర్లు) అలా ఎవరినీ తీర్చిదిద్దలేదు. కేవలం ఆడించారు అంతే. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అని మాట్లాడితే సరిపోదు. టీమ్ఇండియా బెంచ్ బలం ఎక్కడుంది? కేవలం ఐపీఎల్ ఆడుతూ.. మీడియా హక్కుల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తే సరిపోదు. విజయమంటే అది ఒక్కటే కాదు" అని వెంగ్‌సర్కార్ బీసీసీఐ తీరును తీవ్రంగా విమర్శించారు.
Team India ICC Trophies : ఇటీవల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం మూటగట్టుకుంది టీమ్ఇండియా. దీంతో పదేళ్ల ఐసీసీ ట్రోఫీ దాహాన్ని తీర్చుకుందామనుకున్న భారత్‌కు నిరాశే మిగిలింది. ఐసీసీ టోర్నీల్లో వరుస వైఫల్యాలతో టీమ్‌ఇండియా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. భారత జట్టు చివరి సారిగా 2013లో ధోనీ సారథ్యంలో ఐసీసీ ట్రోఫీని గెలిచింది. ఈ క్రమంలో ఆటగాళ్ల ఎంపిక, జట్టు నిర్ణయాలపై మాజీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు కూడా జట్టు పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
India ICC World Cup 2023 : కొందరు ప్లేయర్లు గాయాల బారిన పడి జట్టుకు దూరమవ్వగా.. మరి కొందరు ప్లేయర్లు ఫామ్‌లో లేకపోవడం, నిలకడ ప్రదర్శించకపోవడం వల్ల జట్టు పరిస్థితి దిగజారింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరలో జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023పై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ దిగ్గజం దిలీప్ వెంగ్‌సర్కార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.