Dhoni record in ipl: భారత క్రికెట్లో ధోని పేరు తెలియని వారుండరు. కెప్టెన్ కూల్‌గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు ఈ ఝూర్ఖండ్ డైనమైట్. 28 ఏళ్ల సుధీర్ఘ కాలం తర్వాత భారతదేశానికి ప్రపంచకప్‌ను సాధించిపెట్టాడు. భారత్ విజయాలతో పాటు ఐపీఎల్‌లోనూ తనదైన ముద్ర వేశాడు ధోని.
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు ధోని చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మిగతా అన్ని జట్ల కెప్టెన్లతో పోలిస్తే ధోనీయే అందరికన్నా చిన్నవాడు. సచిన్ టెందుల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్ లాంటి సీనియర్లకు పోటీగా జట్టను నడిపించాడు. తర్వాత కాలంలో ధోని సమకాలికులైన వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గౌతం గంభీర్లతో పాటుగా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. అనంతరం వచ్చిన కొత్త తరం ఆటగాళ్లతో సైతం పోటీ పడ్డాడు. తన జూనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్‌లు కెప్టెన్లుగా ఉన్న సమయంలోనూ ధోని నాయకత్వం వహించాడు. ప్రస్తుతం తనను ఆరాధించిన రిషబ్ పంత్, సంజు శాంసన్ వంటి అభిమానులు సైతం కెప్టెన్లుగా మారిపోయారు. అయినా ధోని ఇప్పటికీ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.
ఇలా నాలుగు తరాల ఆటగాళ్లతో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించిన ధోని ఇప్పటివరకు నాలుగుసార్లు కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. యువ ఆటగాళ్లకు కూడా పోటీనిస్తూ గతేడాది సైతం జట్టును గెలిపించాడు. చెన్నై జట్టుపై నిషేధం విధించిన సమయం మినహా పూర్తికాలం ధోనీయే నాయకత్వం వహించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాడిగా ధోని రికార్డు నెలకొల్పాడు.
ఇదీ చదవండి: ind vs wi first t20 rohith shama: 'శ్రేయస్‌ను అందుకే తుది జట్టులోకి తీసుకోలేదు'