De Villiers on T20 WC Final: పంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఇప్పుడో మ్యాచ్ ఊరిస్తోంది. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో మరోసారి ఇండియా, పాకిస్థాన్ తలపడితే చూడాలని ఎంతో మంది ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పుడు అది జరిగే అవకాశం కూడా ఉంది. గ్రూప్ 2 నుంచి ఇండియా, పాకిస్థాన్‌లే సెమీఫైనల్ చేరిన విషయం తెలిసిందే.
బుధవారం (నవంబర్ 9) పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్.. గురువారం (నవంబర్ 10) ఇండియా, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌లలో ఇండియా, పాకిస్థాన్‌లో గెలిస్తే ఆదివారం (నవంబర్ 13) జరగబోయే ఫైనల్లో తాడోపేడో తేల్చుకుంటాయి. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లోనూ ఈ రెండు టీమ్స్ తలపడగా.. అప్పుడు ఇండియా విజేతగా నిలిచింది.
సాధారణ క్రికెట్ అభిమానులే కాదు సౌతాఫ్రికా లెజెండరీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ కూడా ఇండియా, పాకిస్థాన్ ఫైనల్ జరగాలని బలంగా కోరుకుంటున్నాడు. అందుకే అతడు తన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ పోల్ కూడా నిర్వహించాడు. ఇండియా, పాకిస్థాన్ ఫైనల్ జరుగుతుందా లేదా అన్నది అతడి ప్రశ్న. దీనికి ఏకంగా 77 శాతం మంది ఈ దాయాదుల మధ్యే ఫైనల్ జరుగుతుందని చెప్పడం విశేషం.
తన పోల్ ఫలితాన్ని ట్వీట్ చేస్తూ.. తాను కూడా ఇదే జరగాలని కోరుకుంటున్నట్లు డివిలియర్స్ చెప్పాడు. "నిజంగానే కలల ఫైనల్. ఇప్పటి వరకూ 70 శాతం మంది అవును అన్నారు. కానీ ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లను అంత సులువుగా తీసిపారేయలేమని నేను అనుకుంటున్నాను. ఆ రెండు టీమ్స్ చాలా బాగున్నాయి. మంచి ఫామ్‌లో ఉన్నాయి. రెండు అద్భుతమైన సెమీఫైనల్స్ జరగబోతున్నాయి. నా ఓటు కూడా ఇండియా, పాకిస్థాన్ ఫైనల్‌కే. నోరూరించే ఫైట్ అది" అని డివిలియర్స్ ట్వీట్ చేశాడు.
ఈ ఏడాది తమ తొలి మ్యాచ్‌లో ఈ రెండు టీమ్స్ తలపడ్డాయి. చివరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఆ మ్యాచ్‌లో ఇండియా 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. విరాట్ కోహ్లి 53 బాల్స్‌లోనే 82 రన్స్ చేసి ఒంటిచేత్తో ఇండియాను గెలిపించాడు. ముఖ్యంగా ఆ మ్యాచ్ 19వ ఓవర్ చివరి రెండు బంతులకు విరాట్ కొట్టిన సిక్స్‌లు టోర్నీలోనే హైలైట్‌గా నిలిచాయి.
మరోవైపు, ప్రపంచంలోనే అతిపెద్ద ఔత్సాహిక టీ20 క్రికెట్ లీగ్‌గా అవతరించనున్న 'ది లాస్ట్ మ్యాన్ స్టాండ్స్' ఇండియా సూపర్ లీగ్ 2023 మొదటి ఎడిషన్ సిద్ధమైంది. డివిలియర్స్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఈ టోర్నీ వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 22 మధ్య దిల్లీలో జరగనుంది. దేశంలోని అన్ని నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆటగాళ్లు ఈ ఎల్‌ఎంఎస్‌లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవచ్చని అధికారులు తెలిపారు.