Kaneria about Rahul: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమ్‌ఇండియా ఓటమిపాలవ్వడంపై పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా స్పందించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ వెన్నునొప్పి కారణంగా ఆటకు దూరమవ్వడం వల్ల కేఎల్ రాహుల్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఇది కెప్టెన్‌గా అతడికి తొలి టెస్టు మాత్రమే కావడం వల్ల ఓటమి గురించి అతడిని నిందించాల్సిన అవసరం లేదన్నాడు కనేరియా. అయితే, డ్రెస్సింగ్ రూమ్ నుంచి కోహ్లీ, కోచ్ రాహుల్ ద్రవిడ్ పలు సూచనలు చేయాల్సి ఉండేదని అభిప్రాయపడ్డాడు.
"ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా వెనుకబడింది. అయితే, దక్షిణాఫ్రికా జట్టు పరుగులు చేయడానికి మరింత కష్టపడేలా చేయాల్సింది. అది జరగకపోవడం వల్ల సఫారీలు తేలిగ్గా పరుగులు సాధించారు. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బౌలింగ్‌లో మార్పులు ఏమాత్రం బాగోలేవు. అయితే, ఇందులో రాహుల్‌ను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడు ఇప్పుడే తొలిసారి టెస్టుల్లో కెప్టెన్సీ చేపట్టాడు. కోహ్లీ, ద్రవిడ్ లాంటి వారు డ్రెస్సింగ్ రూమ్ నుంచి బౌలింగ్ విభాగానికి సంబంధించిన పలు సూచనలు పంపించాల్సి ఉండేది. అశ్విన్‌కు కూడా సరైన సమయంలో బౌలింగ్ ఇవ్వలేదు. దక్షిణాఫ్రికా విజయానికి 11 పరుగుల దూరంలో ఇచ్చారు. బుమ్రా, షమీ ధారాళంగా పరుగులిచ్చారు."
-కనేరియా, పాక్ మాజీ క్రికెటర్
కాగా, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఈ సిరీస్ 1-1తో సమానమవ్వగా ఈనెల 11 నుంచి మూడో టెస్టు జరగనుంది. ఇక్కడ విజయం సాధించి తొలిసారి సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలని భారత జట్టు తహతహలాడుతోంది.