ఐపీఎల్-14 సీజన్ సగం కూడా పూర్తి కాకముందే మ్యాచ్‌లు రసవత్తరంగా మారుతున్నాయి. కొన్ని మ్యాచ్ల్లో చివరి ఓవర్‌లో చివరి బంతి వరకూ ఫలితం తేలడం లేదు. అయితే, ఒక్కోసారి కొన్ని జట్లు తొందరగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడటం మనం చూస్తుంటాం. అప్పుడు కొంతమంది ఆటగాళ్లు 'నేనున్నా' అంటూ ముందుకు వచ్చి ఆపద్భాందవులుగా మారుతారు. క్షణాల్లో పరుగుల వరద పారిస్తారు. ఈ ఐపీఎల్‌లో కూడా కొందరు ఆటగాళ్లు ధనాధన్ ఇన్నింగ్స్‌లతో 'ఉప్పెన'లా విరుచుకుపడి ఆ జట్లకు 'జాతిరత్నాలు’గా మారారు. ఇలా 'పవర్ హిట్టింగ్' చేస్తూ వేగవంతమైన అర్ధశతకాలనూ నమోదు చేశారు. మరి ఈ సీజన్‌లో ఇప్పటివరకు వేగవంతమైన అర్ధశతకాలు సాధించిన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.
హడలెత్తించిన హుడా
2021 ఏప్రిల్ 12..రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్. ఈ మ్యాచ్‌లో దీపక్ హుడా (64; 28 బంతుల్లో 4×4, 6×6) సిక్సర్ల వర్షం కురిపించాడు. కళ్లు చెదిరే షాట్లు ఆడుతూ రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో 20 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ సీజన్‌లో వేగవంతమైన అర్ధశతకం బాదిన వీరుడిగా నిలిచాడు. దీపక్.. ఫోర్లు, సిక్సర్ల ద్వారానే 52 పరుగులు సాధించాడంటే అతడు ఎలాంటి ఇన్నింగ్స్ ఆడాడో అర్థమవుతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్.. 221 పరుగుల భారీ స్కోరును సాధించి.. నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.
రఫ్పాడించిన రసెల్
2021 ఏప్రిల్ 21..చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. డుప్లెసిస్(95; 60 బంతుల్లో 9×4, 4×6), రుతురాజ్ గైక్వాడ్ (64; 6×4, 4×6) వీరబాదుడుతో 220 పరుగుల భారీ స్కోరు నమోదుచేసింది. ఛేదనకు దిగిన కోల్‌కతా..5.2 ఓవర్లలోనే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన విండీస్ వీరుడు ఆండ్రీ రసెల్ (54; 22 బంతుల్లో 3×4, 6×6) విధ్వంసం సృష్టించాడు. అలవోకగా సిక్సర్లు బాది చెన్నై బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఈ క్రమంలోనే 21 బంతుల్లో అర్ధశతకం బాదేసి ఈ సీజన్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
కమిన్స్ మెరుపులు
2021 ఏప్రిల్ 12.. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్ కూడా (66; 34 బంతుల్లో 4×4, 6×6) సిక్సర్లతో విరుచుకుపడి నాటౌట్‌గా నిలిచాడు. 23 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ సీజన్‌లో వేగవంతమైన అర్ధశతకం బాదిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మయాంక్ మాయ
2021 ఏప్రిల్ 18.. పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య సమరం. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో మయాంక్ మాయ చేశాడు. కేవలం 36 బంతుల్లోనే 69 పరుగులు బాదాడు. ఇందులో నాలుగు ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన మాయాంక్.. ఈ సీజన్‌లో వేగవంతమైన అర్ధశతకం బాదిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు.
ఇవీ చూడండి: