భారత్ మొదటిసారి ప్రపంచకప్‌ను ముద్దాడిన సంఘటన ఓ పదేళ్ల కుర్రాడి జీవితాన్ని మార్చివేసింది. అది చూసిన ఆ పిల్లాడు ఆ తర్వాత ప్రపంచ క్రికెట్ చరిత్రలో చెరగని ముద్రవేశాడు. అతడే సచిన్ తెందూల్కర్. సచిన్‌పై అంతగా ప్రభావం చూపింది వరల్డ్‌కప్. ఇప్పటివరకు ఇలా ఎందరినో ప్రభావితం చేసిన వరల్డ్‌కప్‌లో అత్యుత్తమ 11 మంది భారత ఆటగాళ్లు ఎవరో చూద్దాం!
సచిన్ తెందూల్కర్.. ఓపెనర్
1992 నుంచి 2011 వరకు ఆరు ప్రపంచకప్‌లు ఆడాడు సచిన్. మొత్తం మెగాటోర్నీల్లో 2278 పరుగులు చేశాడు. ఇందులో 6 శతకాలు, 15 అర్ధ సెంచరీలున్నాయి. ప్రపంచకప్‌లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ రికార్డు సృష్టించాడు. 1996, 2003 మెగాటోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. వరల్డ్‌కప్‌ను ముద్దాడాలన్న తన కలను చివరికి 2011లో తీర్చుకున్నాడు. ఆల్‌టైమ్ ఉత్తమ వన్డే క్రికెటర్‌గా కీర్తినిగడించాడు మాస్టర్.
సౌరవ్ గంగూలీ.. రెండో ఒపెనర్
ప్రపంచకప్ టోర్నీల్లో 1006 పరుగులు చేశాడు గంగూలీ. ఇందులో 4 శతకాలు, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. 1999లో తొలిసారి ప్రపంచకప్ ఆడాడు సౌరవ్. ఈ టోర్నీలోనే శ్రీలంకపై అత్యధికంగా 183 పరుగులు చేశాడు. 2003లో తన కెప్టెన్సీలో జట్టును రన్నరప్‌గా నిలిపాడు. సెమీస్‌లో కెన్యాపై చేసిన శతకం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రపంచకప్‌లో భారత్ తరపున రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గంగూలీ ఘనత సాధించాడు. రెండో ఓపెనర్‌గా సరిపోతాడు.
రాహుల్ ద్రవిడ్.. వన్‌డౌన్
ఉత్తమ వన్డే ఆటగాళ్లలో అతితక్కువ మందిలో ఒకడు రాహుల్ ద్రవిడ్. ఆడిన ప్రపంచకప్ టోర్నీల్లో రెండు శతకాలు, ఆరు అర్ధసెంచరీలతో 860 పరుగులు చేశాడు. 1999 ప్రపంచకప్ టోర్నీలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2003లో భారత్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. మూడో స్థానానికి పర్ఫెక్ట్గా సూటౌతాడు ద్రవిడ్.
మెహిందర్ అమర్నాథ్... మిడిల్ ఆర్డర్/ ఆల్‌రౌండర్
1983 ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఆటగాడు మెహిందర్ అమర్నాథ్. ప్రపంచకప్ టోర్నీల్లో 254 పరుగులతో పాటు 16 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 1983 ప్రపంచకప్ సెమీస్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ మాయచేయగలడు అమర్నాథ్.
మహమ్మద్ అజారుద్దిన్.. మిడిల్ ఆర్డర్
మూడు ప్రపంచకప్ టోర్నీల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు అజారుద్దిన్. 39.33 సగటుతో 826 పరుగులు చేశాడు. ఇందులో 8 అర్ధశతకాలున్నాయి. 1996 వరల్డ్‌కప్‌లో భారత్ సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. మిడిల్ ఆర్డర్లో బలమైన ఆటగాడిగా సత్తా చాటుతాడు.
యువరాజ్ సింగ్.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్
బ్యాటింగ్‌తో అదరగొట్టే యువరాజ్ తన స్పిన్ మాయాజాలంతోనూ ఆకట్టుకోగలడు. ప్రపంచ కప్ టోర్నీల్లో 52.71 సగటుతో 738 పరుగులు చేశాడు. అంతేకాదు 20 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 2011 వరల్డ్‌కప్ సీజన్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు.
మహేంద్ర సింగ్ ధోని... వికెట్ కీపర్/వైస్ కెప్టెన్
వన్డే క్రికెట్లో ఉత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహేంద్ర సింగ్ ధోని. ప్రపంచకప్ టోర్నీలో 507 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ శతకాలున్నాయి. 2011 ప్రపంచకప్‌ను భారత్.. ధోని సారథ్యంలోనే గెలిచింది. స్టంపింగ్‌లు, క్యాచ్‌లు, రనౌట్లతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడంలో దిట్ట. 2015లోనూ భారత్ సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు ధోని.
కపిల్ దేవ్.. కెప్టెన్/ఆల్‌రౌండర్
భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్‌రౌండర్ ఎవరని అడిగితే మొదట చెప్పే పేరు కపిల్ దేవ్. ప్రపంచ కప్ టోర్నీల్లో 669 పరుగులతో పాటు 28 వికెట్లు తీశాడు కపిల్. 1983 ప్రపంచకప్‌ను కపిల్ సారథ్యంలోనే గెల్చుకుంది భారత్. ఆ టోర్నమెంట్లో జింబాబ్వేపై 175 వ్యక్తిగత పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు కపిల్.
జవగల్ శ్రీనాథ్... పేసర్
1996, 1999, 2003 మూడు ప్రపంచకప్‌లు ఆడిన జవగల్ శ్రీనాథ్ భారత్‌కు బెస్ట్ పేసర్. వరల్డ్‌కప్ టోర్నీల్లో 27.81 సగటుతో 44 వికెట్లు తీశాడు. 1996 ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. 2003 భారత జట్టులో కీలక సభ్యుడు.
అనిల్ కుంబ్లే.. స్పిన్నర్
ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ స్టార్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 22.83 సగటుతో 31 వికెట్లను తీశాడు. 1996 టోర్నీలో భారత్ తరఫున ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
జహీర్ ఖాన్.. పేస్ బౌలర్
భారత్‌కున్న మరో అత్యుత్తమ పేసర్ జహీర్‌ఖాన్. తన రివర్స్ స్వింగ్‌తో ప్రత్యర్థులను బెంబేలెత్తించగల సమర్థుడు. మూడు ప్రపంచకప్ లాడిన జహీర్ 20.22 సగటుతో 44 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఉప ఖండపు పిచ్‌ల్లో తనదైన శైలిలో రెచ్చిపోతాడు జహీర్.
విరాట్ కోహ్లి.. 12వ ఆటగాడు
ప్రస్తుతం భారత్ కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లి.. 41.92 సగటుతో 587 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, మూడు అర్ధసెంచరీలున్నాయి. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సమర్థుడు విరాట్. వన్డేల్లో వేగంగా 10వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు సృష్టించాడు.
1983లో ప్రపంచకప్‌ను తొలిసారి అందుకున్న టీమిండియా తర్వాత ఆ కోరిక తీర్చుకోవడానికి 28 ఏళ్లు ఎదురుచూసింది. 2011లో ధోనీ సారథ్యంలోని మెన్ ఇన్ బ్లూ రెండో సారి ప్రపంచకప్ గెలుచుకుంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ నెల 30న ప్రపంచకప్ 12వ సీజన్ ప్రారంభం కానుంది.