పాకిస్థాన్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 94 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయినా 11 పాయింట్లతో ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్‌కూ ఇవే పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉన్న కారణంగా కివీస్ సెమీస్‌కు అర్హత సాధించింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన పాక్ కోచ్ మిక్కీఆర్థర్.. ఐసీసీ నెట్‌రన్‌రేట్ పద్ధతిని పునఃపరిశీలించాలని కోరాడు.
"మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో ఘోర పరాభవమే తమ జట్టు సెమీస్ చేరకపోవడానికి ప్రధాన కారణం. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గెలిచే అవకాశమున్నా సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఈ రెండు ఓటములు నాకు పీడకలలా మిగిలిపోతాయి. సెమీస్ చేరిన న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లను పాకిస్థాన్ జట్టు ఓడించడం సంతోషంగా ఉంది. సెమీస్ చేరిన నాలుగు జట్లకు అభినందనలు".
-మికీ ఆర్థర్, పాకిస్థాన్ కోచ్
పాక్ జట్టు మొదట బ్యాటింగ్ చేస్తే 400పై పరుగులు సాధించాలని అనుకున్న దానిపై ప్రశ్నకు.. "అది నిజమే. తొలి పది ఓవర్లలో శుభారంభం లభిస్తే 400పైగా స్కోర్ చెయ్యాలని అనుకున్నాం. అయితే ఫకర్ జమాన్ ఔటయ్యాక.. బంతి వికెట్ల పైకి వస్తుందని, బ్యాటింగ్ కష్టంగా ఉందని చెప్పాడు. అప్పుడు 270 పరుగులు చేసి బంగ్లాను కట్టడి చెయ్యాలని నిర్ణయించుకున్నాం. ఆ పిచ్‌పై 400 పరుగులు చెయ్యడమంటే అత్యాశే అవుతుంది" అని ఆర్థర్ తెలిపాడు.
ఇవీ చూడండి.. ఆకాశంలో వివాదాస్పద సందేశాలు... బీసీసీఐ ఫిర్యాదు