న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా చివరిదైన రెండో టెస్టు రేపటి(శనివారం) నుంచి మొదలు కానుంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో పలు విషయాలు గురించి మాట్లాడాడు టీమిండియా కోచ్ రవిశాస్త్రి. ఓపెనర్ పృథ్వీషా ఫిట్‌గా ఉన్నాడని, ఈ మ్యాచ్‌లో అతడు ఓపెనర్‌గా వస్తాడని స్పష్టం చేశాడు. తొలి మ్యాచ్‌లో షా తక్కువ స్కోర్లే చేయడం వల్ల అతడి స్థానంలో శుభ్‌మన్‌కు ఆడిస్తారనే వార్తల వస్తున్న నేపథ్యంలో రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు.
స్పిన్నర్ల ఎంపికపై నిర్ణయం
స్పిన్నర్ల విషయంలో అశ్విన్, జడేజాలలో ఎవరిని తీసుకోవాలనేది మ్యాచ్‌కు ముందే నిర్ణయిస్తామన్నాడు రవిశాస్త్రి. తొలి టెస్టులో మూడు వికెట్లే తీసిన అశ్విన్ గురించి మాట్లాడుతూ.. అతడు ప్రపంచస్థాయి బౌలర్ అని, అందులో ఎలాంటి అనుమానం లేదన్నాడు. పరిస్థితులు బట్టి సరైన జట్టును ఎంపిక చేయాల్సి ఉంటుందని చెప్పాడు.
అలాంటి ఓటములు అవసరం
టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తొలి ఓటమి గురించి మాట్లాడాడు రవిశాస్త్రి. అప్పుడప్పుడు ఇలాంటివి అవసరమని అన్నాడు. ఈ ఓటమి టీమిండియా క్రికెటర్లకు ఓ గుణపాఠమని చెప్పాడు. ఇలాంటివి ఎదురైనప్పుడే, క్రికెటర్లు తమ తప్పులు తెలుసుకొని మరింత బాగా ఆడేందుకు దోహదం చేస్తాయన్నాడు.
అలాగే టెస్టులను వన్డేలతో పోల్చడం సరికాదని, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ పిచ్‌లు ఒకేలా ఉంటాయన్నాడు రవిశాస్త్రి. రెండో టెస్టుకు జట్టు సిద్ధంగా ఉందన్నాడు. బుమ్రా, షమి బౌలింగ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాడు. క్రైస్ట్‌చర్చ్‌లో వీరిద్దరూ అద్భుత ప్రదర్శన చేస్తారని ధీమా వ్యక్తం చేశాడు.
ఇదీ చూడండి.. ఐసీసీ నాలుగు రోజుల టెస్టుపై కుంబ్లే ఏమన్నాడంటే?