ప్రపంచకప్ ఫైనల్‌కు అంతా సిద్ధమైంది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్- న్యూజిలాండ్ తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఎవరు గెలిచినా తొలిసారి కప్పును అందుకున్న ఘనత సాధిస్తారు. ఈ క్రమంలోనే ఇరుజట్లలోని ప్రధాన బ్యాట్స్‌మెన్ రూట్, విలియమ్సన్‌లు.. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ రికార్డుపై కన్నేశారు.
సచిన్ తెందుల్కర్- 673 పరుగులు
ఓ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత సచిన్ తెందుల్కర్ (673 పరుగులు) పేరిట ఉంది. 2003లో 11 మ్యాచ్‌లాడి 61.18 సగటుతో ఈ ఘనత సాధించాడు లిటిల్ మాస్టర్. ఇందులో ఆరు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. 16 ఏళ్లుగా ఇది చెక్కుచెదరకుండా అలానే ఉంది. దీన్ని అధిగమించేందుకు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ రూట్ 125 పరుగులు చేయాల్సి ఉండగా, కివీస్ కెప్టెన్ 126 పరుగులు చేస్తే ఈ రికార్డు బద్దలవుతుంది.
ఈ రికార్డుకు దగ్గరగా వచ్చారు కానీ..!
రూట్, విలియమ్సన్ కాకుండా ఈ ప్రపంచకప్‌లో 600కు పైగా పరుగులు ముగ్గురు బ్యాట్స్‌మెన్ చేశారు. రోహిత్ శర్మ (టీమిండియా)- 648 పరుగులు, డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 647 పరుగులు, షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 606 పరుగులు చేశారు. వీరు దగ్గర వరకు వచ్చి ఈ రికార్డును అందుకోలేకపోయారు.
కివీస్‌తో సెమీఫైనల్లో భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ ఘనత అందుకుంటాడని అందరూ అనుకున్నారు. అప్పటికే ఈ ప్రపంచకప్‌లో 5 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ చేశాడు హిట్‌మ్యాన్. కానీ ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగుకే ఔటై పెవిలియన్ చేరాడు.
ఈ సారి కొత్త ఛాంపియన్
ఇరుజట్లలో ఎవరూ గెలిచినా తొలిసారి ప్రపంచకప్‌ను అందుకున్న జట్టుగా రికార్డు సృష్టిస్తారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఇంగ్లాండ్ దుర్భేద్యంగా ఉంది. టోర్నీ ఆసాంతం అంచనాలకు మించి రాణిస్తూ వచ్చింది న్యూజిలాండ్. ఆదివారం 'క్రికెట్ కా మక్కా' లార్డ్స్‌లో విజేత ఎవరనేది తేలనుంది.