ప్రతి క్రికెట్ అభిమాని భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చూసేందుకు సిద్ధమవుతున్నాడు. చిరకాల ప్రత్యర్థుల్లో గెలుపెవరిదో తెలుసుకునేందుకు మరికాసేపట్లో టీవీలకు అతుక్కుపోనున్నాడు. అయితే మాంచెస్టర్‌లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఏకంగా మ్యాచ్ నిర్వహణపైనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇంగ్లాండ్‌ను వర్షాలు ముంచెత్తుతుండటం, రసవత్తర పోరుకు వేదికైన ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటం ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందో? లేదో? అన్న ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల మెదళ్లను తొలిచివేస్తోంది. ఆదివారం మాంచెస్టర్‌లో వర్షం పడే అవకాశముందని అక్యూవెదర్ వెబ్సైట్ తెలపడం అందరినీ మరింత ఆందోళనలో పడేసింది.
" మ్యాచ్‌కు రెండు రోజుల ముందే ఓల్డ్ ట్రాఫోర్డ్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం మధ్యాహ్నం కూడా తేలికపాటి చిరుజల్లులు కురిసి దాయాదుల పోరుకు అడ్డంకిగా మారే అవకాశాలున్నాయి. ఉష్టోగ్రత 17 డిగ్రీలకు చేరనుంది."
-అక్యూవెదర్, వాతావరణ సంస్థ
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షం అడ్డంకిగా మారకూడదని అందరూ కోరుకుంటున్నారు.
ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే వర్షం కారణంగా నాలుగు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇందులో భారత్-కివీస్ మ్యాచ్ కూడా ఉంది. బ్లాక్ క్యాప్స్‌తో మ్యాచ్ వర్షార్పణం అయినందుకే అభిమానులు ఐసీసీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాల పోస్టులు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు.