2019 ప్రపంచకప్‌కు వరుణుడు అడ్డంకిగా మారుతున్నాడు. మెగాటోర్నీ ఆరంభమైన రెండు వారాలకే నాలుగు మ్యాచ్‌లు తుడిచిపెట్టుకుపోయాయి. గురువారం భారత్- న్యూజిలాండ్ మ్యాచ్ టాస్ పడకుండానే రద్దైంది. ఇప్పుడు అందరి చూపు ఆదివారం జరిగే భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌పైనే.
దాయాది దేశాల పోరుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజే వేరు. ఇరు దేశాల మధ్య కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడం వల్ల... అభిమానులు ఐసీసీ టోర్నీల్లో వీరి సమరం కోసం ఎదురుచూస్తారు. ఈసారీ టికెట్లు హాట్ కేక్స్లా అమ్ముడుపోయాయి.
ఇంతటి ప్రాముఖ్యత కలిగిన భారత్-పాక్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశముంది. దాయాదుల పోరుకు వేదికైన మాంచెస్టర్‌లో గత కొన్ని రోజులుగా వర్షం కురుస్తోంది. మ్యాచ్ రోజునా వరుణుడి ముప్పు పొంచి ఉందని అక్కడి వాతావరణశాఖ తెలిపింది. ఇదే జరిగితే ఇక ప్రపంచకప్‌పై ఆసక్తి పోతుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెగాటోర్నీల్లో ఇప్పటి వరకు పాక్‌తో తలపడ్డ ఆరు మ్యాచుల్లోనూ టీమిండియానే గెలిచింది.
ఇదీ చూడండి:- 'ఆ రోజు మాలోని అత్యుత్తమ ఆట ప్రదర్శిస్తాం'