ఓ ఓవర్ త్రో.. ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో వివాదానికి కారణమైంది. ఈ విషయం వల్ల నిర్వహకులను అందరూ విమర్శించారు. ఇప్పుడు ఈ నియమంపై పునరాలోచనలో ఉంది మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎమ్‌సిసి).
"ఎమ్.సి.సి తన నిబంధనల్లోని ఓవర్‌త్రో అంశంపై పునరాలోచించుకోవాలని నిర్ణయించుకుంది." -ద సండే టైమ్స్ రిపోర్ట్
అసలు కారణం ఇదే..!
లార్డ్స్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ విజయానికి 3 బంతుల్లో 9 పరుగులు కావాలి. అప్పుడు రెండు పరుగులు తీసేందుకు స్టోక్స్ ప్రయత్నించాడు. ఆ సమయంలో కివీస్ ఆటగాడు గప్తిల్ బంతిని కీపర్ వైపు విసిరాడు. క్రీజులోకి రాబోతున్న స్టోక్స్ బ్యాట్‌ను తాకిన ఆ బంతి బౌండరీకి వెళ్లింది. ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేన.. మొత్తం ఆరు పరుగులు(2+4) ఇచ్చారు.
ఆ తర్వాత మ్యాచ్ టైగా ముగిసింది. అనంతరం సూపర్ ఓవర్ టై అయింది. మ్యాచ్ మొత్తంలో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లాండ్ విజేతగా అవతరించింది.
ఈ విషయంపై స్పందించిన ఐసీసీ ఎలైట్ ప్యానల్ మాజీ అంపైర్ సైమన్ టాఫెల్.. ఆ త్రోకు ఐదు పరుగులు ఇవ్వాల్సిందని చెప్పారు.
ఇది చదవండి: రిటైర్ అవ్వట్లేదు.. కానీ విండీస్ పర్యటనకు దూరం