వన్డే క్రికెట్లో తనదైన బౌలింగ్ శైలి, ప్రదర్శనతో ఆకట్టుకుంటోన్న టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా... భారత జట్టుకు ఎన్నో విజయాలు అందిస్తున్నాడు. ఓటమి అంచుల్లో ఉన్న మ్యాచ్‌లను తన బౌలింగ్‌తో గెలిచేలా చేస్తున్నాడు. డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడం బుమ్రాకు వెన్నతో పెట్టిన విద్య. ఎంతటి ప్రత్యర్థులనైనా భయపెట్టగలడు. పరుగులు నియంత్రించడంలో దిట్ట. మరి బుమ్రా.. అంతటి నైపుణ్యం సంపాదించడానికి గల కారణాలను విశ్లేషించాడు శ్రీలంక పేసర్ లసిత్ మలింగ. వీరిద్దరూ ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
" బుమ్రాను 2013లో కలిశాను. అప్పటికే అతడు పేస్ బౌలింగ్ బాగా వేయగలడు. కానీ కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బంతుల్ని వేయలేకపోయేవాడు. దీని కోసం బాగా శ్రమించాడు. టీ20ల్లో ప్రత్యేక నైపుణ్యం ఉంటేనే ప్రాముఖ్యత సంపాదించవచ్చనే విషయాన్ని తెలుసుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్ సహా స్లో బంతుల్ని వేయడం నేర్చుకున్నాడు. నెట్స్‌లో సాధన చేసి అనుకున్నట్లు కచ్చితంగా మ్యాచ్‌లో అమలు చేయగలుగుతాడు. అదే అతడిని ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా తయారుచేసింది ".
-- లసిత్ మలింగ, శ్రీలంక బౌలర్
ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురవ్వకపోవడం, ఓవర్లో ఆరు బంతుల్ని యార్కర్లుగా వేయగలిగే సత్తా ఉండటం బుమ్రాకు బాగా కలిసొచ్చే అంశమని అభిప్రాయపడ్డాడు మలింగ. వచ్చే ఏడాది లోపు మ్యాచ్ పరిస్థితుల్ని సంపూర్ణంగా తెలుసుకుని ఎవరూ అధిగమించలేని స్థాయికి బుమ్రా చేరుకుంటాడని చెప్పుకొచ్చాడు లసిత్.
ఐపీఎల్ 2019లో ముంబయి ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన ఈ ఇద్దరు స్పీడ్స్టర్లు... ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఒక్క పరుగు తేడాతో ఓడించి.. విజయంలో కీలకపాత్ర పోషించారు.