కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతుతోనే అంతర్జాతీయ క్రికెట్లో తాను విజయవంతంగా రాణిస్తున్నానని భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తెలిపాడు. బౌలర్లకు విరాట్ స్వేచ్ఛనిస్తాడని, అందువల్లే చక్కటి ప్రదర్శనలు చేశానని చెప్పాడు. ఐపీఎల్ ప్రదర్శనను ప్రపంచకప్‌తో పోల్చలేమని అన్నాడు. ఈ ఐపీఎల్లో కోల్‌కతా తరపున ఆడిన కుల్దీప్ 9 మ్యాచుల్లో 4 వికెట్లు మాత్రమే తీశాడు.
"ఐపీఎల్ అనేది విభిన్నమైన ఫార్మాట్. ప్రపంచకప్ అలా కాదు. ఐపీఎల్లో సత్తాచాటిన చాలామంది అంతర్జాతీయ మ్యాచుల్లో విఫలమయ్యారు. నేను వికెట్లు తీయనంత మాత్రాన బౌలింగ్ బాగా వేయనట్లు కాదు. జట్టు కోసం ఏం చేయాలో ఓ క్రికెటర్‌గా అదే చేశాను. కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలర్లకు స్వేచ్ఛ ఇస్తాడు. అందువల్లే నేను విజయవంతంగా రాణిస్తున్నాను" - -కుల్దీప్ యాదవ్, భారత స్పిన్నర్
ధోనీపై తాను మాట్లాడిన మాటలను మీడియా వక్రీకరించిందని, ఓ సీనియర్ ఆటగాడిపై ఎవరూ అలాంటి ఆరోపణలు చేయరని తెలిపాడు కుల్దీప్. మహీ సలహాలు చాలా సార్లు పనిచేయలేదని కుల్దీప్ అన్నట్టుగా మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.