ప్రపంచకప్‌లో ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్న భారత్.. శ్రీలంకతో శనివారం నామమాత్రపు చివరి లీగ్ మ్యాచ్‌ను ఆడనుంది. అయితే సెమీస్‌కు ముందు కెప్టెన్ కోహ్లీ రెండు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొనే ప్రమాదంలో ఉన్నాడు. ప్రవర్తనా నియమావళి కింద ఇప్పటికే మూడు డీ మెరిట్ పాయింట్లు విరాట్ ఖాతాలో ఉన్నాయి. ఇంకో పాయింట్ చేరితే రెండు మ్యాచ్‌ల నిషేధం పడుతుంది.
పది రోజుల్లో 2 పాయింట్లు..
మైదానంలో దూకుడుగా కనిపించే విరాట్ కోహ్లీ అఫ్గాన్‌తో మ్యాచ్ సందర్భంగా ఔట్ విషయమై ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ కారణంగా రిఫరీ.. కోహ్లీ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడమే కాకుండా, ఓ డీ మెరిట్ పాయింట్ చేర్చాడు.
బంగ్లాతో మ్యాచ్‌లోనూ సౌమ్య సర్కార్ ఎల్బీడబ్ల్యూ విషయమై అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించాడు విరాట్. అయితే ఇందుకు జరిమానా నుంచి తప్పించుకున్న కోహ్లీ.. డీ మెరిట్ పాయింట్‌ను తన ఖాతాలో చేర్చుకున్నాడు. ఇలా పది రోజుల వ్యవధిలోనే 2 పాయింట్లు రావడం పట్ల జట్టు యాజమాన్యం ఆందోళన చెందుతోంది. గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లోనూ కోహ్లీ ఖాతాలో ఓ డీ మెరిట్ పాయింట్ చేరింది.
అతిక్రమిస్తే తప్పదు మూల్యం..
ఐసీసీ నిబంధనల ప్రకారం రెండేళ్లలో ఓ ఆటగాడి ఖాతాలో నాలుగు డీ మెరిట్ పాయింట్లు వస్తే అతడు రెండు వన్డేలు లేదా రెండు టీ 20లు లేదా ఓ టెస్టు మ్యాచ్‌కు ఇలా ఏదో ఒక దానికి దూరం కావాల్సి ఉంటుంది. శనివారం శ్రీలంకతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నిబంధనలు అతిక్రమించకుండా మౌనంగా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకవేళ సెమీస్‌లో అతిక్రమిస్తే కోహ్లీ ఫైనల్‌కు దూరం కావాల్సి ఉంటుంది.