NSA Phone Usage Tips : మీ స్మార్ట్‌ఫోన్ హ్యాకర్స్ బారిన పడకుండా సురక్షితంగా ఉండాలా? అయితే ఇది మీ కోసమే. మీ ఫోన్‌ను సింపుల్‌గా స్విఛ్ ఆఫ్ చేస్తే చాలు - హ్యాకర్స్ బారిన పడకుండా మీ ఫోన్ సేఫ్‌గా ఉంటుందని అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ నిపుణులు చెబుతున్నారు. అయితే మనం ఎంత తరచుగా ఫోన్ టర్న్ ఆఫ్ చేయాలి? దీని వల్ల ఇంకా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలా మంది స్మార్ట్‌ఫోన్ వాడుతూ ఉంటాం. కానీ దాని మెయింటెనెన్స్ గురించి ఏమాత్రం పట్టించుకోరు. వాస్తవానికి స్మార్ట్‌ఫోన్ అనేది మన జేబులో ఉన్న మినీ పర్సనల్ కంప్యూటర్ లాంటిది. దీనిని చక్కగా మెయింటైన్ చేస్తేనే, అది దీర్ఘకాలంపాటు చక్కగా పనిచేస్తుంది. హ్యాకర్స్ బారిన పడకుండా ఉంటుంది.
ఇలా చేయండి!
వారానికి కనీసం ఒక్కసారైనా మీ ఫోన్‌ను పూర్తిగా టర్న్ ఆఫ్/ స్విఛ్ ఆఫ్ చేయాలి. దీని వల్ల హానికరమైన (మలీషియస్) లింక్స్ ద్వారా, జీరో-క్లిక్ ఎక్స్‌ప్లోయిట్స్ ద్వారా జరిగే హ్యాకింగ్‌ను మీరు పూర్తిగా నిరోధించవచ్చు. దీని వల్ల మీ విలువైన డేటా సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకోకుండా కాపాడుకోగలుగుతారు. పైగా ఫోన్ టర్న్ ఆఫ్ చేయడం వల్ల మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది!
సాధారణంగా సైబర్ నేరగాళ్లు మీ మొబైల్‌కు ఫోన్ చేయడం లేదా హానికారకమైన లింక్‌లను పంపించడం లాంటివి చేస్తుంటారు. వీటి ద్వారా మీ డివైజ్‌లోకి మాల్వేర్లు, స్పైవేర్లు ఇన్స్టాల్ అయిపోతాయి. క్రమంగా మీ ఫోన్ హ్యాకర్ల అధీనంలోకి వెళ్లిపోతుంది. కానీ ఈ విషయం మీకు తెలియకుండా జరిగిపోతుంది. ఇలాంటి వాటిని సమర్థంగా అడ్డుకోవాలంటే, కచ్చితంగా మీ ఫోన్‌ను రీబూట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు హానికరమైన మాల్వేర్లు, స్పైవేర్లు మీ ఫోన్ నుంచి తొలగిపోతాయి. అంతేకాదు రెగ్యులర్‌గా రీబూట్ చేయడం వల్ల మీ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ స్మూత్‌గా రన్ అవుతుంది. అలాగే మిగతా యాప్స్ కూడా చక్కగా వర్క్ చేస్తాయి.
బోనస్ టిప్ : మీరు మీ ఫోన్‌ను స్విఛ్ ఆఫ్ చేసి ఎంత కాలం అయ్యిందో తెలుసుకునే వీలు కూడా ఉంది. ఇందుకోసం మీ ఆండ్రాయిడ్ ఫోన్లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్కడ 'Device' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తరువాత 'Status'పై క్లిక్ చేయండి. అక్కడ మీకు డివైజ్ అప్‌టైమ్ మీకు కనిపిస్తుంది.