క్రైస్ట్‌చర్చ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ ఆఖరి పోరాటానికి సిద్ధమవుతున్నాయి. తొలి టెస్టులో అనూహ్యంగా చిత్తయిన కోహ్లీసేన.. శనివారం ఆఖరి టెస్టులో కివీస్‌ను ఢీకొంటుంది. బలంగా పుంజుకుని సిరీస్‌ను ఎలాగైనా సమం చేయాలని భారత్ తపిస్తుంటే.. క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో ఆతిథ్య జట్టు ఉంది. ఇలాంటి సమయంలో భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.
పృథ్వీకి గాయం.!
రెండో టెస్టు ముంగిట భారత్ యువ ఓపెనర్ పృథ్వీ షా గాయపడ్డాడు. అతడి ఎడమ కాలి పాదం వాచింది. ఫలితంగా గురువారం ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉన్నాడు. మ్యాచ్‌కు పృథ్వీ అందుబాటులో ఉండేది లేనిది నేడు స్పష్టత రానుంది. ఒకవేళ అతడు దూరమైతే శుభ్‌మన్ గిల్ టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్యంలో ఈ యువ క్రికెటర్ ప్రాక్టీస్‌లో చెమటోడ్చాడు. తొలి మ్యాచ్‌లో బ్యాట్‌తో అంతగా ఆకట్టుకోని అశ్విన్ స్థానంలో జడేజా ఆడే అవకాశముంది.
పేస్‌కు నిలవాలి..
మంచి బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్.. తొలి టెస్టులో ప్రత్యర్థి పేస్‌కు బోల్తాకొట్టడం నిరాశపర్చింది. రహానె (46, 29) మయాంక్ (34, 58) మినహా మిగతా ఏ ఒక్క బ్యాట్స్‌మన్ క్రీజులో నిలవలేకపోయారు. పేసర్లను ఎదుర్కోలేక చేతులెత్తేశారు. ఈ మ్యాచ్‌లో ఎలా పుంజుకుంటారో చూడాలి.
ముఖ్యంగా సౌథీ, బౌల్ట్‌ల పదునైన పేస్‌ను టీమిండియా ఎంత సమర్థంగా ఎదుర్కొంటుంది? అనే అంశంపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌ను నిరూపించుకోవడం భారత్‌కు చాలా అవసరం. సిరీస్‌ను సమం చేయాలంటే భారత పేసర్లూ రాణించాల్సి ఉంది.