ప్రపంచకప్ ముంగిట తన చివరి వార్మప్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. నేడు కార్డిఫ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది భారత్. మొదటి సన్నాహక మ్యాచ్‌లో కివీస్ చేతిలో పరాజయం పాలైన కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో గెలిచి సానుకూల దృక్పథంతో ప్రపంచకప్‌ను ప్రారంభించాలని అనుకుంటోంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్, విజయ్ శంకర్ల గాయాలు జట్టును కలవరపెడుతున్నాయి.
బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌లపై కివీస్ బౌలింగ్ చేతిలో తలవంచారు టీమిండియా బ్యాట్స్‌మెన్. ట్రెంట్ బౌల్డ్ సీమ్, స్వింగ్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. భారత్‌ను ఇబ్బందిపెడుతున్న సమస్యల్లో మిడిలార్డర్ కూర్పు ఒకటి. నాలుగు, ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు ఎవరు రావలన్న విషయమై ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ మ్యాచ్‌లో ఆ సమస్యకు పరిష్కారం దొరకాలని భావిస్తోంది యాజమాన్యం.
విజయ్ శంకర్, కేదార్ జాదవ్ గాయంతో దూరమవగా వచ్చిన అవకాశాన్ని రాహుల్ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి మ్యాచ్‌లో విఫలమైన రోహిత్, శిఖర్, కోహ్లీ సత్తాచాటాల్సిన అవసరం ఉంది. బంగ్లా లెఫ్టార్మ్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మన్‌తో పాటు రుబెల్ హసన్ బౌలింగ్‌ను టీమిండియా బ్యాట్స్‌మెన్ ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం.
మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన హార్దిక్ మంచి ప్రదర్శన చేశాడు. హార్దిక్ 5వ స్థానంలో రాగా ధోని ఆరవ స్థానంలో ఆడాడు. ఈ మ్యాచ్‌లోనూ ఇదే ఆర్డర్ కొనసాగిస్తారా అన్నది చూడాలి.
- బంగ్లాదేశ్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ మధ్యాహ్నం 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఇవీ చూడండి...WC 19: 2015-రికార్డులు.. మెరుపులు..భావోద్వేగాలు