న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో భారత్ ఓటమిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ స్పందించాడు. జడేజా, ధోని అద్భుతంగా ఆడారని, వారి పోరాటపటిమను ప్రశంసించాడు. అయితే భారత బ్యాటింగ్ టాపార్డర్‌పైనే ఆధారపడుతోందని, మిగతా వారు బాధ్యత తీసుకోవాల్సి ఉందన్నాడు.
"మ్యాచ్ చూసి నాకు చాలా నిరాశ కలిగింది. 240 పరుగుల లక్ష్యాన్ని ఎలాంటి అనుమానం లేకుండా ఛేదించే వీలుంది. న్యూజిలాండ్ మొదట్లోనే 3 వికెట్లు తీసి భారత అభిమానుల కలలను ఆవిరి చేసి ఉండొచ్చు. కానీ బ్యాటింగ్‌లో ఎప్పుడూ టాపార్డర్‌పైనే ఆధారపడుతోంది టీమిండియా. ప్రతీ సారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బలమైన పునాది వేయలేకపోవచ్చు. మిగతా వారు కూడా బాధ్యత తీసుకోవాలి" -సచిన్ తెందూల్కర్
అన్నీ సార్లు ధోని వచ్చి ముగించాలనుకోవడం సరికాదని మాస్టర్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా రాణించారని కితాబిచ్చాడు. విలియమ్సన్ వ్యూహాలు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయని చెప్పాడు.
మాంచెస్టర్ వేదికగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 18 పరుగలు తేడాతో ఓడి మెగాటోర్నీ నుంచి నిష్క్రమించింది. జడేజా (77), ధోని (50) అర్ధశతకాలతో రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు.
ఇది చదవండి: కోహ్లీ, ధోని అప్పుడు ఇప్పుడు ఒకేలా..!