ఐసీసీ ప్రపంచకప్ 2019లో జింగ్ బెయిల్స్ బాగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. బంతి తగిలి లైట్లు వెలిగినా బెయిల్స్ పడట్లేదంటూ భారత సారథి విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా సారథి ఆరోన్ ఫించ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన ఐసీసీ... టోర్నీ మధ్యలో ఎలాంటి మార్పులు చేయబోమని స్పష్టం చేసింది.
"ఈ మెగా ఈవెంట్ సమగ్రతకు భంగం కలిగిస్తూ టోర్నీ మధ్యలో ఎలాంటి మార్పులు చేయము. పది జట్లు ఆడే 48 మ్యాచ్‌లకు వీటినే ఉపయోగిస్తాం. గత వరల్డ్‌కప్ నుంచి అన్ని అంతర్జాతీయ ఆటలకు ఇవే బెయిల్స్ వినియోగిస్తున్నాం. అప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకు తలెత్తుతోంది. ఇవన్నీ ఆటలో భాగమే. టోర్నీ మధ్యలో మార్పులు కుదరవు".
--అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
ఇప్పటివరకు ప్రపంచకప్ ప్రారంభమై రెండు వారాలు ముగిసింది. జరిగిన 16 మ్యాచుల్లో ఐదు సార్లు బంతి తాకినా బెయిల్స్ పడని ఘటనలు ఉత్పన్నమయ్యాయి. జూన్ 9న ఆస్ట్రేలియాతో పోరులో టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా వేసిన మొదటి ఓవర్‌లో... బంతి లెగ్ స్టంప్‌ను బలంగా తాకినా బెయిల్స్ పడలేదు. ఫలితంగా ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆరంభంలోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు అర్ధశతకంతో రాణించాడు.
బెయిల్స్ మధ్యలో వైర్లు...
బంతి వికెట్లను తాకినప్పుడు కనిపించేందుకు వీలుగా బెయిల్స్, స్టంప్స్ లోపల లైట్లు అమర్చారు. అయితే వాటికి ఉన్న వైర్ల బరువు వల్లే బెయిల్స్ పడటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బంతి వికెట్లకు తాకి బెయిల్స్ పడకపోతే బ్యాట్స్‌మెన్‌ను నాటౌట్‌గా ప్రకటించడం క్రికెట్ నిబంధన.
ఇవీ చూడండి: