పురుషుల ప్రపంచకప్ నేపథ్యంలో ఐసీసీ బుధవారం క్రియో ఛాలెంజ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా అభిమానులంతా సోషల్‌మీడియాలో క్రికెట్ ఆడుతున్న ఫొటోలు పంచుకోవాలని కోరింది. ఈ పోస్టులకు #criiio హ్యాష్ ట్యాగ్ జత చేయాలని సూచించింది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 46 కోట్ల మంది క్రికెట్ అభిమానులున్నారు. అందరినీ ఒక చోట చేర్చాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైన క్యాంపెయిన్ ప్రారంభించింది ఐసీసీ.
![ICC launches criiio campaign on eve of World Cup](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3411755_criio2.jpg)
" ఐసీసీ పురుషుల ప్రపంచకప్ సందర్భంగా పది జట్లు, ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లను ఒకే వేదికపైకి తీసుకొస్తున్నాం. క్రియో అనేది ఓ పండగ లాంటిది. సోషల్‌మీడియా ద్వారా అర బిలియన్‌కుపైగా అభిమానులు మాతో కలిసి ఈ ఆనందంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. అందుకే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఈ క్యాంపెయిన్‌లోకి ఆహ్వానిస్తున్నాం. క్రికెట్ అనేది అందరిది. కలిసికట్టుగా ఉంచుతుంది. అంతేకాకుండా ఖర్చు తక్కువ. సులభంగా, సరదాగా ఉండే ఆట. ఈ కార్యక్రమం ద్వారా ఎన్ని విధాలుగా ప్రజలు ఆట ఆడుతున్నారో అందరితో పంచుకుంటాం".
--మను సాహ్నే, ఐసీసీ ప్రధానాధికారి
గతంలో 'వరల్డ్ వైడ్ వికెట్స్' పేరిట ఐసీసీ నిర్వహించిన క్యాంపెయిన్‌కు మంచి స్పందన లభించింది. కొంతమంది సముద్రం ఒడ్డున, మరికొంత మంది పెరడులో ఇలా రకరకాల ప్రదేశాల్లో క్రికెట్ ఆడినవి ఈ హ్యాష్‌ట్యాగ్‌తో పంచుకుంటున్నారు.
![ICC launches criiio campaign on eve of World Cup](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3411755_criio.jpg)
మే 30న ప్రపంచకప్ టోర్నీ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆరంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తలపడనున్నాయి.