వన్డే ప్రపంచ కప్ ఆరంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఐసీసీ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సిద్ధమయ్యాయి. టోర్నీలో గురువారం తొలి మ్యాచ్ జరగనుండగా... నేడు ఆరంభ వేడుకలు జరపనున్నారు. లండన్‌లోని ప్రఖ్యాత ‘మాల్’ రోడ్డుకు సమీపంలో ఉన్న చారిత్రక బకింగ్‌హామ్ ప్యాలెస్ వద్ద ఈ సంబరాలు నిర్వహిస్తారు. క్రికెట్, సంగీతం, వినోదం కలగలిపి సంబరాలు ఉంటాయి. ఇందులో పాల్గొనేందుకు 4 వేల మంది అభిమానులను బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎంపిక చేసి ఉచితంగా టికెట్లను అందజేశారు.
ఈ వేడుకలకు ప్రస్తుతం ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆటగాళ్లెవరూ హాజరు కావట్లేదు. మాజీ ఆటగాళ్లు, కొంతమంది ప్రత్యేక అతిథులు మాత్రమే ఇందులో పాల్గొంటారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యుత్తమంగా నిర్వహిస్తామని టోర్నీ మేనేజింగ్ డైరెక్టర్ స్టీవ్ ఎల్‌వర్తీ హామీ ఇచ్చారు. 1999 వరల్డ్‌కప్ ఆరంభోత్సవ కార్యక్రమం సరిగ్గా నిర్వహించలేదనే విమర్శలు మూటగట్టుకుంది ఐసీసీ.
![ICC Cricket World Cup 2019 Opening ceremony announced](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3411756_opening.jpg)