ఆతిధ్య ఇంగ్లాండ్ ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టేసింది. బర్మింగ్‌హామ్ వేదికగా గురవారం జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో గెలిచింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన క్రిస్ వోక్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచగా నిలిచాడు.
224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. దాన్ని సునాయసంగా ఛేదించింది. ఓపెనర్ రాయ్ 85 పరుగులతో ఆకట్టుకున్నాడు. మిగతా వారిలో బెయిర్‌స్టో 34 పరుగులు చేశాడు. రూట్(49)తో కలిసి కెప్టెన్ మోర్గాన్(45) లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమిన్స్ తలో వికెట్ దక్కించుకున్నారు.
ఆ రికార్డు సాధించిన తొలి బౌలర్ స్టార్క్
ఈ సీజన్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన మిచెల్ స్టార్క్.. ఈ మ్యాచ్‌లో బెయిర్‌స్టోను ఔట్ చేసి అరుదైన ఘనత సాధించాడు. టోర్నీ మొత్తంగా 27 వికెట్లు తీసి... ఒక ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ ఘనత మెక్‌గ్రాత్ (2007 ప్రపంచకప్‌లో 26 వికెట్లు) పేరిట ఉండేది.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. ప్రారంభం నుంచే వికెట్లు కోల్పోయింది. వార్నర్, ఫించ్ తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు.
నిలిచిన స్మిత్- కేరీ జోడి
అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్ ఒంటరి పోరాటం చేశాడు. కేరీతో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో 46 పరుగులు చేసి కేరీ ఔటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన వారు వచ్చినట్లే వెనుదిరిగారు. 85 పరుగులు చేసిన స్మిత్ ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. 49 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది కంగారూ జట్టు.
ఇంగ్లీష్ జట్టు బౌలింగ్ అదరహో..
ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్, రషీద్ తలో మూడు వికెట్లు దక్కించుకున్నారు. ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టాడు. 8 ఓవర్ల వేసిన వోక్స్ కేవలం 20 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇది చదవండి: WC19: గాయంతోనే కేరీ కీలక ఇన్నింగ్స్