వన్డే ప్రపంచకప్ జట్ల సారథులకు బ్రిటన్ రాణి ఎలిజబెత్-2, ప్రిన్స్ హ్యారీ నుంచి గొప్ప ఆతిథ్యం లభించింది. ప్రతి ఒక్కరికి విషెస్ తెలుపుతూ కాసేపు సరదాగా మాట్లాడారు ఎలిజబెత్ రాణి. తర్వాత పది జట్ల కెప్టెన్లతో తీసుకున్న ఫొటోలను అధికారిక ట్విట్టర్ ద్వారా పంచుకుంది రాయల్ ఫ్యామిలీ.
" ఈ టోర్నమెంటు ప్రపంచంలోని పది జట్లను ఒక వేదికపైకి తీసుకొస్తోంది. తొమ్మిది జట్లు కామన్వెల్త్ దేశాల నుంచే రావడం విశేషం. గార్డెన్ పార్టీకి హాజరయ్యే ముందు ఇయాన్ మోర్గాన్, విరాట్ కోహ్లీతో సహా అందరు కెప్టెన్లు బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో రాణిని కలిశారు".
-- రాయల్ ఫ్యామిలీ అధికారిక ట్విట్టర్
అనంతరం జరిగిన వేడుకకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. దాదాపు గంటసేపు కార్యక్రమం అలరించింది. ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఫ్లింటాఫ్, శివానీ దండేకర్, ప్యాడీ మెక్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. రిచర్డ్స్, కుంబ్లే, బ్రెట్‌లీ, జయవర్దనె లాంటి దిగ్గజ క్రికెటర్లు పాల్గొన్నారు. వీరితో పాటు పాకిస్థాన్‌కు చెందిన నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్ జాయ్, బంగ్లాదేశ్ సినీ తార జయ ఎహసాన్ పాల్గొంది. చివర్లో ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ప్రపంచకప్ ట్రోఫీని వేదికపై తీసుకురాగా, ఓ పాటతో వేడుకలు ముగిశాయి.
విరాట్ మైనపు విగ్రహం...
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మైనపు బొమ్మను లార్డ్స్ మైదానంలో ఆవిష్కరించారు. టోర్నీ ముగిసే వరకు ఈ విగ్రహం టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రదర్శించనున్నారు.