ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌కు వెళ్లనున్న తరుణంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రీ ముంబయిలో మీడియాతో మాట్లాడారు. వరల్డ్‌కప్‌లో మహేంద్ర సింగ్ ధోనీ కీలకపాత్ర పోషించనున్నాడని రవిశాస్త్రి తెలిపాడు. గేమ్ ఉత్కంఠ బరితంగా సాగుతున్నప్పుడు మహీ సలహాలు ఉపయోగపడతాయని, జట్టుపై అతడు ఎంతో ప్రభావం చూపిస్తాడని తెలిపాడు.
"భారత జట్టుకు ధోనీ సేవలు ఎంతో కీలకం. ఎన్నో ఏళ్ల పాటు కీపర్‌గా అన్ని ఫార్మాట్లలో రాణించాడు. వన్డేల్లో మహీ అందుకునే క్యాచ్‌లు, చేసే రనౌట్లు, స్టంపింగ్స్ మ్యాచ్‌పై ఎంతో ప్రభావం చూపిస్తాయి. ఒక్కోసారి ఇలాంటి చిన్న చిన్న విషయాలే విజయాన్ని నిర్ణయిస్తాయి. ఈ ఐపీఎల్లో ధోనీ బ్యాటింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు" -రవిశాస్త్రి, భారత్ కోచ్
ఈ ఐపీఎల్లో ధోనీ 83.2 సగటుతో 416 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రన్నరప్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.
ప్రపంచకప్‌లో ప్రతీ జట్టుకు విజయావకాశముందని, ఎవర్నీ తక్కువ అంచనా వేయలేమని రవిశాస్త్రి చెప్పాడు. 2014కు ఇప్పటికీ అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు తమ ఆటలో ఎంతో మెరుగయ్యాయని, మెగాటోర్నీలో పోటీ తీవ్రంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.