ఈ ఏడాది ప్రపంచకప్‌లో బెయిల్స్ మరోసారి వివాదం సృష్టిస్తున్నాయి. బంతి తాకినా పడకుండా ఉండటంపై టీమిండియా సారథి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ ఆడిన మ్యాచ్‌లో ఈ విధంగా జరిగింది. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో అయిదోసారి ఇలాంటి ఘటన పునరావృతమైంది.
ఏమైంది..?
ఛేదనలో 56 పరుగులతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేసిన వార్నర్.. ఒక్క పరుగుకే వెనుదిరగాల్సింది. బుమ్రా వేసిన తొలి బంతిని అతను డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాట్‌కు తాకాక బంతి స్టంప్స్ వైపు వెళ్లింది. లెగ్ వికెట్‌కు తాకింది కూడా. బంతి కొంచెం వేగంగానే తాకినప్పటికీ.. వార్నర్ అదృష్టం కొద్దీ బెయిల్స్ పడకపోవడం మూలంగా నాటౌట్‌గా మిగిలాడు. ఆ బంతి గంటకు 140 కిమీ వేగంతో వేయడం విశేషం. అప్పుడు వార్నర్ స్కోరు 1. తర్వాత కుదురుకున్న ఈ ఆసీస్ ఓపెనర్ 56 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ బెయిల్స్ పడకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
" బంతి అంత బలంగా తాకినా బెయిల్స్ పడలేదంటే బ్యాట్స్‌మెన్‌గా నాకే ఆశ్చర్యమేసింది. బౌలింగ్ వేసింది మీడియం పేసర్ కాదు ఫాస్ట్ బౌలర్. ధోనీ స్టంప్ చెక్ చేద్దాం అని చెప్పాడు. నిజానికి అది చూడటానికి బాగానే ఉన్నా మరి ఎందుకు బెయిల్ పడలేదో అర్థం కాలేదు. బెయిల్ బరువుగా ఉంటే స్టంప్ లైట్ వెలుగుతుంది. కాని అదీ జరగట్లేదు. మంచి బౌలింగ్ వేసినపుడు వికెట్‌కు తగిలి ఔట్ అవ్వకపోవడం, వికెట్లు కదిలి బెయిల్స్ పడకపోవడం నేనెప్పుడూ ఇంతకు ముందు చూడలేదు ".
--విరాట్ కోహ్లీ, భారత క్రికెట్ జట్టు సారథి.
ప్రపంచ కప్‌లో వాడుతున్న మిరుమిట్లు గొలిపే 'జింగ్ బెయిల్స్' బరువుగా ఉండటమే దీనికి కారణమని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే బెయిల్స్ లోపల లైట్ల కోసం చిన్నపాటి సర్క్యూట్, వైర్లు ఉంటాయి ఇవే కాస్త బరువు పెంచుతున్నాయని వివరణ ఇస్తున్నారు.
ఈ టోర్నీలో ఇంతకుముందు ఇలాంటి ఘటనలు నాలుగు సార్లు జరిగాయి. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో డికాక్, బౌల్ట్ బౌలింగ్‌లో కరుణరత్నే, స్టార్క్ బౌలింగ్‌లో గేల్, సైఫుద్ధీన్ బౌలింగ్‌లో స్టోక్స్ ఇలానే ఔట్ అవ్వకుండా బయటపడ్డారు.
ఇవీ చూడండి...