భారత్-ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ అంటే చాలా రసవత్తరంగా ఉంటుంది. ఇప్పటికే కంగారూ గడ్డపై అమీతుమీ తేల్చుకోడానికి టీమ్ఇండియా కంగారూ గడ్డపై అడుగుపెట్టింది. ఇరుజట్లు వన్డే, టీ20, టెస్టు సిరీస్‌లు ఆడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లపై తనదైన అభిప్రాయం వ్యక్తం చేశాడు భారత మాజీ పేసర్ జహీర్‌ఖాన్. ఈ సిరీస్‌లో బౌలర్లే ఫలితాలను నిర్ణయిస్తారని స్పష్టం చేశాడు. రెండు జట్లలో ప్రపంచస్థాయి టాప్ బౌలర్లు ఉండటమే దీనికి కారణమని అన్నాడు. ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరగనున్నాయి. నవంబర్ 27న తొలి వన్డేతో ఈ పర్యటన ప్రారంభమవుతుంది.
"ఆస్ట్రేలియా పిచ్‌లు మంచి బౌన్స్, పేస్‌కు అనుకూలం. అందుకే బౌలర్లే మూడు సిరీస్‌ల్లో ఫలితాలను నిర్ణయిస్తారు. జట్టులోని బౌలింగ్ విభాగాం ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా టాప్ బౌలర్ల గురించి మాట్లాడుకుంటే మనకు గుర్తొచ్చే ఆటగాళ్లంతా ఈ సిరీస్‌లో బరిలోకి దిగుతున్నారు. బుమ్రా, షమి, స్టార్క్, కమిన్స్ లాంటి టాప్ ర్యాంక్ బౌలర్ల ఉండటం వల్ల ఈ మ్యాచ్‌లు రసవత్తరంగా ఉంటాయి"
-- జహీర్‌ఖాన్, భారత మాజీ క్రికెటర్
జాగ్రత్తగా ఉండాల్సిందే..
స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ రాకతో ఆస్ట్రేలియా జట్టు బలంగా మారిందని జహీర్ అన్నాడు. అందుకే భారత్ కాస్త కఠిన పరీక్ష ఎదుర్కొనే అవకాశముందని అభిప్రాయపడ్డాడు. ఇరుజట్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్ఠంగా ఉండటం వల్ల పర్యటన రసవత్తరంగా ఉంటుందని, అభిమానులకు మంచి వినోదాన్ని పంచుతుందని చెప్పాడు.
2018-19లో ఇరుజట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. 2-1 తేడాతో ట్రోఫీ నెగ్గిన కోహ్లీసేన ఈసారి అదే పట్టుదలతో బరిలోకి దిగుతోంది.