టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిమానులకు శుభవార్త. అతడు రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకొనేందుకు నిర్ణయించుకున్నాడట. అంతర్జాతీయ క్రికెట్ కాకుండా దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలని భావిస్తున్నట్లు సమాచారం.
గతేడాది యువీ అన్ని ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పేశాడు. ఆ తర్వాత విదేశీ టీ20 లీగుల్లోనూ ఆడాడు. కొన్నాళ్లుగా ఈ స్టార్ ఆల్‌రౌండర్... శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ,అన్మోల్‌ప్రీత్ సింగ్‌కు మొహాలీలోని పీసీఏ స్టేడియంలో పంజాబ్ సంఘం తరఫున వారికి మార్గనిర్దేశం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్వయంగా బ్యాటు పట్టుకొని నెట్స్‌లో షాట్లు ఎలా ఆడాలో నేర్పిస్తుండగా.. తనలోని ఆటగాడిని చూసి ఆశ్చర్యపోయినట్లు యువీ పేర్కొన్నాడు. ఇటీవలే ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నాడు.
"యువ క్రికెటర్లతో సమయం గడపడం, ఆట పరంగా విభిన్న అంశాలు వారికి నేర్పించడం చాలా బాగుంది. నెట్స్‌లో వారికి కొన్ని షాట్లు చూపించాను. బంతిని అద్భుతంగా బాదుతుండటం చూసి నాపై నాకే ఆశ్చర్యం వేసింది. అప్పటికే నేను బ్యాటింగ్ చేసి చాలా కాలమైంది. రెండు నెలలు పంజాబ్ తరఫున ఆఫ్ సీజన్ శిబిరానికి వచ్చాను. యువకులతో కలిసి సాధన మ్యాచ్‌లు ఆడాను. పరుగులు తీశాను. అప్పుడు పంజాబ్ కార్యదర్శి పునీత్ బాలీ నా వద్దకొచ్చి వీడ్కోలు వెనక్కి తీసుకోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు"
యువరాజ్ సింగ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
అనంతరం కొన్ని వారాల పాటు ఆలోచించి.. రీఎంట్రీకి అనుమతి కోరుతూ బీసీసీఐకి ఈమెయిల్ పంపించినట్లు యువీ తెలిపాడు.
"మొదట్లో అనిపించలేదు కానీ తర్వాత ఆలోచిస్తే ప్రతిపాదన నచ్చింది. పంజాబ్‌కు ఛాంపియన్‌షిప్‌లు అందించాలని ప్రేరణ కలిగింది. భజ్జీ, నేనూ వేర్వేరుగా ఎన్నో గెలిచాం. కానీ ఇద్దరం కలిసి పంజాబ్‌కు ఏం చేయలేకపోయాం. అదే నన్ను నిర్ణయం తీసుకొనేందుకు పురికొల్పింది. అనుమతి వస్తే మాత్రం కేవలం టీ20లు మాత్రమే ఆడతాను. చూద్దాం, ఏం జరుగుతుందో" అని యువీ అన్నాడు.