టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మళ్లీ బ్యాట్ పడతాడా? రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని దేశవాళీ బరిలో దిగుతాడా..? ప్రస్తుతానికి అతడు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు గానీ పంజాబ్ క్రికెట్ సంఘం (పీసీఏ) మాత్రం యూవీ ఆడాలని కోరుకుంటోంది. అనుభవజ్ఞుడైన క్రికెటర్ రంజీ జట్టుకు అవసరమని భావిస్తోన్న పీసీఏ.. జట్టులో ఆటగాడిగా ఉంటూ కుర్రాళ్లకు మార్గనిర్దేశకుడిగా వ్యవహరించాలని యువరాజ్‌ను కోరింది.
"మళ్లీ ఆడాలని ఆరు రోజుల కిందట యువీని అడిగాం. అతడి జవాబు కోసం ఎదురుచూస్తున్నాం. ఆటగాడిగా, మార్గనిర్దేశకుడిగా యువరాజ్ జట్టులో ఉంటే పంజాబ్ క్రికెట్‌కు ఎంతో మేలు జరుగుతుంది". అని పీసీఏ కార్యదర్శి పునీత్ బాలి చెప్పాడు.
38 ఏళ్ల యువరాజ్ గతేడాది అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవడం తేలికేం కాకపోవచ్చు. బీసీసీఐ రిటైరైన ఆటగాళ్లకు మాత్రమే విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు అనుమతి ఇస్తుంది. అలా యువీ ఇప్పటికే రెండు విదేశీ టోర్నమెంటుల్లో ఆడాడు.