యువీ.. ఆరు సిక్సర్లతో అదరగొట్టాడు. హ్యాట్రిక్ వికెట్లు తీసి మురిపించాడు. టీమ్‌ఇండియాకు ప్రపంచకప్‌లు అందించాడు. కేన్సర్‌తో బాధపడుతున్న చిన్నారులకు ఆపద్బాంధవుడు అయ్యాడు. ఇప్పుడు మెంటార్ అవతారం ఎత్తాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఏదో ఒక జట్టుకు కాదు. ఈ సీజన్‌లో రాణించాలనుకునే పంజాబ్ యువ క్రికెటర్లకు మార్గనిర్దేశం చేస్తున్నాడు యువరాజ్ సింగ్.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత యువరాజ్ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. తన స్వచ్ఛంద సంస్థ పనులు చూసుకుంటున్నాడు. సరదా కోసం విదేశీ పొట్టి క్రికెట్ లీగులు ఆడుతున్నాడు. అప్పుడప్పుడు యువ క్రికెటర్లను తీర్చిదిద్దే పని పెట్టుకున్నాడు. కొన్ని రోజుల క్రితం పంజాబ్ క్రికెట్ సంఘం ఏర్పాటు చేసిన శిబిరంలో ఆటగాళ్లకు సలహాలు ఇచ్చాడు.
కాగా ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడుతున్న పంజాబ్ క్రికెటర్లకు మార్గనిర్దేశం చేస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో పీసీఏ జిమ్ అందుబాటులో లేకపోవడం వల్ల శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రభుసిమ్రన్ సింగ్, అన్మోల్ ప్రీత్‌సింగ్ కసరత్తులు చేసేందుకు తన సొంత జిమ్‌ను అప్పగించాడు. త్వరగా దేహదారుఢ్యం సాధించేదుకు సలహాలు ఇచ్చాడు. వారికి క్రికెట్ పాఠాలూ చెప్పాడు. మానసిక దృఢత్వం గురించి బోధించాడు. చక్కని ఆహారాన్ని అందిస్తూ సొంత తమ్ముళ్లుగా ఆదరించాడు. అందుకే సీజన్ పూర్తయ్యే వరకు యువీతో టచ్‌లో ఉంటామని, అవసరమైన సలహాలు అడుగుతామని ఆ కుర్రాళ్లు అంటున్నారు. సెప్టెంబర్19 నుంచి నవంబర్ 10 వరకు ఐపీఎల్ 2020 జరుగబోతుంది.