టీమిండియా తరఫున ఆడుతున్న యువ ఆల్‌రౌండర్ శివమ్‌దూబె నిలకడగా ఆడేందుకు కాస్త సమయమివ్వాలని అన్నాడు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. హార్దిక్ పాండ్య స్థానంలో జట్టులోకి వచ్చిన దూబె.. ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.
శివమ్‌దూబె నైపుణ్యం కలిగిన ఆటగాడని, అంతర్జాతీయ వేదికలపై రాణించాలంటే కాస్త సమయమివ్వాలని యువరాజ్ సింగ్ చెప్పాడు. వెన్ను గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పాండ్య.. త్వరలో జట్టులో చేరే అవకాశముందని, వచ్చీ రాగానే అతడు ఎలా రాణిస్తాడనే దానిపై ఇప్పుడే చెప్పలేమన్నాడు. ఇప్పటికైతే దూబెకు మంచి అవకాశాలే ఇచ్చారని, భవిష్యత్‌లో ఎవరు నిలకడగా రాణిస్తారనే విషయాన్ని పరిశీలిద్దామని యువీ తెలిపాడు.
ప్రస్తుత న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న దూబె.. ఇటీవలే జరిగిన చివరి టీ20లో ఒకే ఓవర్‌లో 34 పరుగులిచ్చి అనవసరపు రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కు గురయ్యాడు.
దూబె ఇప్పటివరకు 13 టీ20లు ఆడగా అందులో తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో మాత్రమే బ్యాటింగ్ చేశాడు. మొత్తం 105 పరుగులు చేయగా అత్యధిక స్కోర్ 54. ఇక బౌలింగ్ విషయానికొస్తే 10.04 ఎకానమీతో ఐదు వికెట్లే తీశాడు.