భారత మాజీ ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ హైదరాబాద్‌లో క్రికెట్ అకాడమీ ఆఫ్ పఠాన్స్ (క్యాప్)కు చెందిన 26వ అకాడమీని ప్రారంభించాడు. నగరంలోని వర్ధమాన ఆటగాళ్లకు ప్రపంచ స్థాయి క్రికెట్ శిక్షణ అందించాలనే లక్ష్యంతో ఈ అకాడమీని స్థాపించినట్లు పఠాన్ పేర్కొన్నాడు.
"ప్రపంచ స్థాయి క్రికెట్ శిక్షణ అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని నెలకొల్పాం. వర్ధమాన క్రికెటర్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి వారి క్రీడా అభివృద్ధికి దోహదపడుతాం. దేశానికి నాణ్యమైన ప్లేయర్లను అందించడానికి కృషి చేస్తామని" యూసుఫ్ తెలిపాడు.
ఈ ఏడాది చివరి నాటికి మరో 25 నగరాలలో క్యాప్ కేంద్రాలను స్థాపిస్తామని క్యాప్ మేనేజింగ్ డైరెక్టర్ హర్మీత్ వాసుదేవ్ పేర్కొన్నాడు. త్వరలోనే సంబంధిత మొబైల్ యాప్‌ను కూడా తీసుకురానున్నట్లు తెలిపాడు. ఇది విద్యార్థులకు, కోచ్‌లకు మధ్య వారధిలా పనిచేయనుందని అభిప్రాయపడ్డాడు.
క్యాప్, పిచ్విజన్ స్పోర్ట్స్‌తో కలిసి పనిచేయనుంది. ఇదొక ఆన్లైన్ శిక్షణ వేదిక. ఇది శిక్షణార్థుల పనితీరును అంచనా వేస్తుంది. లైన్, లెంగ్త్, బౌన్స్, పేస్ వంటి విషయాలలో విద్యార్థులను ట్రాక్ చేస్తుంది.
ఇదీ చదవండి: 'పింక్' జట్టుపై ఎటూ తేల్చని ఇంగ్లాండ్!