హాకీ అంటే మేజర్ ధ్యాన్‌చంద్ ఎలా గుర్తొస్తారో బల్బీర్‌సింగ్ సీనియర్ సైతం అంతే. భారత హాకీ రంగానికి వీరిద్దరూ శిఖర సమానులు. మొహాలిలో సోమవారం కన్నుమూసిన బల్బీర్‌సింగ్ హాకీనే కాదు క్రికెట్‌నూ ఇష్టపడేవారు. ఒకానొక సందర్భంలో ధోనీ ఆయనను కలిసి యోగక్షేమాల గురించి వాకబు చేయగా "మీ విజయం నాకు స్వస్థత చేకూరుస్తుంది" అని అన్నారట.
నాలుగేళ్ల క్రితం ఆయనను టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ కలిశాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మొహాలిలోని పీసీఏ స్టేడియంలో ఆస్ట్రేలియాతో భారత్ తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు ముందు బల్బీర్‌సింగ్‌ను కలిసిన మహీ... ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాడు.
అప్పుడు బల్బీర్‌సింగ్ నవ్వుతూ "మీ విజయం నా ఆరోగ్యానికి స్వస్థత చేకూరుస్తుంది" అని బదులిచ్చారు. అందుకు ధోనీ ధన్యవాదాలు తెలియజేశాడు. ఆ తర్వాత "భారత జట్టు మూడో ప్రపంచకప్ గెలిచి గోల్డెన్ హ్యాట్రిక్ సాధించాలని కోరుకుంటున్నా" అని బల్బీర్‌సింగ్ మీడియాకు వివరించారు.
అయితే ఆస్ట్రేలియాపై గెలిచిన టీమ్‌ఇండియా సెమీస్‌లో వెస్టిండీస్ చేతిలో త్రుటిలో ఓటమి చవిచూసింది. ఫలితంగా హ్యాట్రిక్ అందుకోలేకపోయింది. ధోనీ సారథ్యంలో భారత్ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచింది. బల్బీర్ సింగ్ మాత్రం హాకీలో వరుసగా మూడు ఒలింపిక్ స్వర్ణాలు అందుకున్న వ్యక్తిగా ఘనత సాధించారు.
ఇదీ చూడండి : బల్బీర్ ఆట చిరస్మరణీయం.. వ్యక్తిత్వం అనుసరణీయం