టీమ్ఇండియా మాజీ సారథి ధోనీ.. 'క్రికెట్ ఛాంపియన్' అని ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ మైకేల్ హస్సీ అన్నాడు. లాక్డౌన్ విరామంతో అతడికి ఆత్మపరిశీలన చేసుకొనే అవకాశం దొరికిందని భావిస్తున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే మహీ.. భారత్ తరఫున తిరిగి ఆడతాడా? లేదా? అనే విషయం గురించి వేచి చూడాలని తెలిపాడు.
"నేను టీమ్ఇండియా సెలెక్టర్‌ను కాను. అయితే, మీరు ధోనీని అంత సునాయాసంగా తీసిపారేస్తారని అనుకోవడం లేదు. ఎందుకంటే ఎప్పుడూ ఛాంపియన్ల గురించి తక్కువ అంచనా వేయకూడదు. ధోనీ ఓ ఆటగాడిగా, సారథిగా దేశానికి ఎంతో సేవచేశాడు. తనను తాను ఆరోగ్యంగా ఉంచుకున్నంత కాలం అతడికి అడ్డు లేదు. లాక్డౌన్ మహీకి శారీరకంగా, మానసికంగా విశ్రాంతి తీసుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అతడికి చాలా అనుభవం ఉంది. ధోనీ నైపుణ్యాలను అవసరమైన స్థాయికి మెరుగుపరుచుకునేందుకు కొంత సమయం పడుతుంది. అయితే ఆట గురించి గొప్ప అవగాహన ఉన్న వ్యక్తికి నైపుణ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు"
మైకేల్ హస్సీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
ధోనీ మళ్లీ క్రికెట్లో అడుగుపెట్టే విషయంపై మట్లాడుతూ.. "దేశం కోసం తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ధోనీ సిద్ధంగా ఉన్నాడా, లేడా? అనేది అతనికి చెందిన విషయం. ఇప్పటికీ ధోనీ మంచి ప్రదర్శన ఇస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు" అని వెల్లడించాడు.
గతేడాది జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిన తర్వాత.. ధోనీ క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 ప్రపంచకప్‌తో ధోనీ తిరిగి మైదానంలో అడుగు పెడతాడా లేదా అనే విషయంపై క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ టోర్నీ నిర్వహణపై సందిగ్దత నెలకొంది. మరోవైపు ఐపీఎల్లో చెన్నైసూపర్ కింగ్స్‌కు సారథిగా వ్యవహరించాల్సి ఉండగా.. లాక్డౌన్ కారణంగా లీగ్ నిరవధిక వాయిగా పడింది.
ఇదీ చూడండి:లాక్డౌన్ తర్వాత ఆలియా పరిస్థితి ఏంటి?