భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ తాను తీవ్రంగా ఒత్తిడికి గురైన ఓ సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో తీవ్ర కుంగుబాటుకు లోనైనట్లు వెల్లడించాడు. ఆ సమయంలో.. 'ప్రపంచంలో నేనొక్కడినే ఒంటరివాడిని' అనే భావన కలిగిందని తెలిపాడు విరాట్. 'నాట్ జస్ట్ క్రికెట్' పేరుతో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మార్క్ నికోలస్ చేసిన పాడ్కాస్ట్లో ఈ వివరాలు వెల్లడించాడు కోహ్లీ.
"అవును.. నేనూ ఒత్తిడికి గురయ్యా. పరుగులు సరిగ్గా చెయ్యలేకపోతున్నాం అనే బాధతో రోజు ప్రారంభించడం చాలా కష్టంగా ఉంటుంది. దాదాపు చాలా మంది బ్యాట్స్మెన్ ఇది అనుభవించి ఉంటారు. ఇలాంటి సమయంలో ఏదీ మన అదుపులో ఉండదు. దీని నుంచి ఎలా బయటపడాలో అస్సలు తెలియదు. ఇంగ్లాండ్ టూర్లో నేనది అనుభవించా. ప్రపంచంలో నేనొక్కడినే ఒంటరివాడినేమో అనిపించింది."
- విరాట్ కోహ్లీ, భారత జట్టు కెప్టెన్.
2014 ఇంగ్లాండ్ టూర్లో విరాట్ పేలవ ప్రదర్శన చేశాడు. ఐదు టెస్టులు ఆడి వరుసగా 1, 8, 25, 0, 39, 28, 0, 7, 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కానీ, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మళ్లీ ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఫామ్లోకి వచ్చాడు.
ఇదీ చదవండి:'ఈ సంతోషం పంచుకోవడానికి తమ్ముడు లేడు'