వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్ నుంచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్స్ ఆరంభం కానుంది. ఇందులో భారత ఆటగాళ్లు జెర్సీలపై పేర్లు, నెంబర్లతో బరిలో దిగనున్నారు. యాషెస్ సిరీస్‌తో తొలిసారి ఈ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టనున్నారు. అయితే టెస్టు క్రికెట్ ఆడని ధోని జెర్సీ నెంబర్ 7 కెటాయింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇంతకు ముందు సచిన్ నెంబర్ 10 ఉన్న జెర్సీని ధరించాడు శార్దుల్ ఠాకుర్. అయితే అతడిపై అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేశారు. ఈ కారణంగా ఆ జెర్సీని ఎవరు వేసుకోకుండా అనధికారికంగా వీడ్కోలు పలికింది బీసీసీఐ.
నాలుగేళ్ల క్రితమే టెస్టు క్రికెట్ నుంచి వైదొలిగాడు మహీ. అయితే ధోనికి కూడా సచిన్ మాదిరి గౌరవమే దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందించారు.
"పరిమిత ఓవర్ల క్రికెట్లో విరాట్ 18వ నెంబర్, రోహిత్ 45వ నెంబర్ జెర్సీలను వాడుతున్నారు. టెస్ట్ క్రికెట్‌కు ధోని వీడ్కోలు చెప్పినప్పటి నుంచి అతడి జెర్సీ నెంబర్ 7 అందుబాటులో ఉంది. అయితే ఇతర ఆటగాళ్లు ఆ జెర్సీని దక్కించుకునే అవకాశం దాదాపు తక్కువే" - బీసీసీఐ ప్రతినిధి
చాలామంది క్రికెటర్లు వన్డే, టీ 20ల్లోని జెర్సీ నెంబర్లే టెస్టు ఫార్మాట్లోను ఉపయోగించనున్నారు. ఆగస్టు 1న జరగనున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు పేర్లు, నెంబర్లు ఉన్న జెర్సీలతో ఆడనున్నారు.
ఇది చదవండి: క్రికెట్‌కు శ్రీలంక స్టార్ పేసర్ వీడ్కోలు