ఎన్నో ఆశలు, ఎన్నో భావోద్వేగాలు, మరెన్నో జ్ఞాపకాల కలయికే ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ వేదికగా జరిగిన 2015 ప్రపంచకప్ టోర్నీ. బ్యాట్స్‌మెన్ బాదుడు, బౌలర్ల విజృంభణ, ఫీల్డర్ల కళ్లు చెదిరే విన్యాసాలు, డబుల్ సెంచరీలు, ఉత్కంఠ భరిత ముగింపులు, పేలవ ప్రదర్శనలు, జట్ల సమష్టి కృషి.. ఆ టోర్నీ ఆసాంతం క్రికెట్ ప్రేమికులను అలరించాయి. వీటన్నింటినీ దాటి చివరకు ప్రపంచకప్‌ను ముద్దాడింది ఆస్ట్రేలియా.
14 జట్లు.. రెండు గ్రూపులు
2015 ప్రపంచకప్‌నకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చాయి. 14 జట్లను రెండు గ్రూపులుగా విభజించింది ఐసీసీ. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన టీమిండియా... గ్రూప్-బీలో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే, యూఏఈ జట్లతో తలపడింది. 2011 ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లోనే వెనుదిరిగిన ఆస్ట్రేలియా... గ్రూప్ ఏలో న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్లతో పోటీపడింది.
ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేసిన భారత్... టోర్నీ ముందు అభిమానులను భయపెట్టింది. కానీ మెగాటోర్నీలో మాత్రం డిఫెండింగ్ ఛాంపియన్ స్థాయికి తగిన ప్రదర్శనే చేసింది.
పాక్‌పై మరో విజయం
ఆసియా సహా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూసేది భారత్- పాకిస్థాన్ మ్యాచ్ కోసమే. అప్పటి దాకా ఐసీసీ టోర్నమెంట్లలో ఎన్నడూ దాయాది చేతిలో ఓడిపోని టీమిండియా... గ్రూప్ దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి ఆ పరంపరను కొనసాగించింది. మెగా టోర్నమెంట్లలో పాకిస్థాన్‌తో ఆరు సార్లు తలపడిన భారత్... ఒక్కసారీ ఓడిపోలేదు.
సెమీస్‌లో ముగిసిన భారత్ పోరు
2011లో తన సారథ్యంలో భారత్‌కు ప్రపంచకప్ అందించిన ధోని.. 2015లోనూ జట్టును ముందుండి నడిపించాడు. బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, ధావన్, కోహ్లీ, రహానే.. బౌలర్లు ఉమేష్ యాదవ్, షమీ, అశ్విన్‌లు రాణించడం వల్ల సెమీస్‌లో అడుగుపెట్టింది భారత్. కానీ టోర్నీలో టీమిండియాకు అదే చివరి మ్యాచ్‌గా మిగిలిపోయింది. 2011లో క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్... ఈసారి సెమీస్‌లో విఫలమైంది. ఆసీస్ చేతిలో ఓడిపోయింది. బ్యాటింగ్‌లో ధావన్ మినహా ఎవరూ రాణించలేదు. కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. మూడో ప్రపంచకప్ వేటను సెమీస్‌తోనే ముగించింది టీమిండియా.
ఉత్కంఠ పోరిదే..
ఎన్నో ఆశలతో మెగాటోర్నీలో అడుగుపెట్టిన న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన చేసింది. టోర్నీ మొత్తం కళ్లుచెదిరే ఫీల్డింగ్, బ్యాటింగ్ చేసిన సారథి బ్రెండన్ మెక్‌కలమ్ కివీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా గ్రూప్ దశలో జరిగిన న్యూజిలాండ్- ఆస్ట్రేలియా పోరు 2015 ప్రపంచకప్‌లోనే అత్యంత ఉత్కంఠ భరితంగా మ్యాచ్. తక్కువ స్కోరు మ్యాచ్‌లూ నరాలు తెగే ఉత్కంఠ కలిగిస్తాయని ఈ పోరు నిరూపించింది. అద్భుతమైన బౌలింగ్‌తో ఆస్ట్రేలియాను 151 పరుగలకే కట్టడిచేసింది కివీస్ జట్టు. బౌల్ట్ 5 వికెట్లు తీసి తన స్వింగ్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. అనంతరం మెక్‌కలమ్ విజృంభించి ఆడటం వల్ల గెలుపు కివీస్‌దే అనుకున్నారు. కానీ అతడు ఔటయ్యాక మిచెల్ స్టార్క్(6/28) ధాటికి న్యూజిలాండ్ మిడిలార్డర్ కుప్పకూలింది. చివరకు విలియమ్సన్ జట్టును గట్టెక్కించాడు. మ్యాచ్ మొత్తం 55 ఓవర్లలోనే ముగిసింది. గ్రూప్‌దశలో జరిగిన ఈ పోరు 2015 ప్రపంచకప్ 'మ్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచింది.
ఆ జట్లకు అందని ద్రాక్షే
దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌కు ప్రపంచకప్ ఇప్పటివరకు ఓ అందని ద్రాక్ష. అంచనాలకు మించి రాణించినా కప్ వేటలో ప్రతిసారీ విఫలమయ్యేవి ఈ జట్లు. అలాంటి జట్లు 2015 ప్రపంచకప్ సెమీస్‌లో పోటీ పడ్డాయి. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. 43 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసి జోరుమీదున్న సమయంలో వరుణుడు మ్యాచ్‌ను అడ్డుకున్నాడు. డక్‌వర్త్ లూయీస్ ప్రకారం 291 పరుగుల లక్ష్యంతో బరిలో దిగింది న్యూజిలాండ్. మెక్‌కలమ్, గ్రాంట్ ఎలియట్, కొరీ అండర్సన్ రాణించడం వల్ల ఫైనల్స్‌లో అడుగుపెట్టింది కివీస్. సెమీస్‌లో ఓడిన అనంతరం ప్రోటీస్ ఆటగాళ్లు కంటతడి పెట్టిన ఘటన క్రికెట్ అభిమానులను కలచివేసింది.
ఆసీస్‌కు ఎంతో ప్రత్యేకం
ఆస్ట్రేలియా అప్పటికే 1987, 1999, 2003, 2007 ప్రపంచకప్‌లు గెలిచింది. కానీ 2015 ప్రపంచకప్ ఆ జట్టుకు ఎంతో ప్రత్యేకం. బ్యాట్స్‌మెన్ ఫిలిప్ హ్యూస్ ఆకస్మిక మృతితో ఆసీస్ ఆటగాళ్లు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఆ చేదు అనుభవంతో ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన ఆసీస్ ఎంతో కసిగా ఆడింది. గ్రూప్ దశలో వర్షం వల్ల రద్దయిన బంగ్లాదేశ్ మ్యాచ్, న్యూజిలాండ్‌తో ఓటమి మినహా అన్ని మ్యాచ్‌లు గెలిచింది.
ఫలించని 183 మ్యాజిక్
సారథి మెక్‌కలమ్ మీద కివీస్ జట్టు ఎంత ఆధారపడిందో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది. ఈసారి కచ్చితంగా ప్రపంచ కప్‌ను సొంతం చేసుకోవాలన్న ధ్యేయంతో మెల్బోర్న్లో జరిగిన ఫైనల్స్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. మెక్‌కలమ్ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఆ తర్వాత జట్టు మెత్తం 183 పరుగులకే కుప్పకూలింది. 1983 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న భారత్... ఫైనల్లో సరిగా 183 పరుగులే చేసింది. అదే మ్యాజిక్ పునరావృతం అవుతుందనుకున్నారు అంతా. కానీ మైఖేల్ క్లార్క్(74) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆసీస్‌కు ఐదో ప్రపంచకప్‌ను అందించాడు. ఆసీస్ ఆటగాళ్లు కప్‌ను ఫిలిప్ హ్యూస్కు అంకితమిచ్చి ఘన నివాళులర్పించారు. న్యూజిలాండ్ కల చెదిరింది.
రికార్డులు.. విశేషాలు
⦁ ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారిగా 2015లో రెండు ఆరంభ వేడుకలు జరిగాయి.
⦁ 2015కు ముందు జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో ఒక్క ద్విశతకం కూడా నమోదు కాలేదు. ఆ టోర్నీలో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. జింబాబ్వేపై క్రిస్ గేల్ 215 పరుగులు చేశాడు.
మార్లెన్ శామ్యూల్స్‌తో 372 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రికార్డు సృష్టించాడు. ఇప్పటికీ ఆ రికార్డును ఎవరూ బద్దలుకొట్టలేదు. వెస్టిండీస్‌తో జరిగిన క్వార్టర్స్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 237 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 264 పరుగుల తర్వాత వన్డేల్లో ఇప్పటికీ ఇదే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు.
⦁ ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర వరుసగా 4 శతకాలు చేసి రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్పై సెంచరీలు బాదాడు.
⦁ పాకిస్థాన్‌తో జరిగిన పోరులో ఆస్ట్రేలియా విజయం సాధించినప్పటికీ... వహబ్ రియాజ్ వేసిన అద్భుతమైన స్వింగ్ బౌలింగ్ ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో షేన్ వాట్సన్‌కు వేసిన 33వ ఓవర్ టోర్నమెంట్కే హైలెట్.
⦁ ఈ ప్రపంచకప్‌లో గప్తిల్ 547 పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో మొదటి స్థానం దక్కించుకున్నాడు. బౌలింగ్‌లో ఆ ఘనత మిచెల్ స్టార్క్(22 వికెట్లు) అందుకున్నాడు.
2015 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్, ఐర్లాండ్, జింబాబ్వే, యూఏఈ జట్లు గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టాయి. క్వార్టర్స్‌లో భారత్‌తో తలపడిన బంగ్లాదేశ్... న్యూజిలాండ్‌తో తలపడిన వెస్టిండీస్... దక్షిణాఫ్రికాతో పోటీపడిన శ్రీలంక.. ఆస్ట్రేలియాను ఢీకొన్న పాక్ ఓటమి పాలై వెనుదిరిగాయి.
2015 గతం. 2019 ప్రస్తుతం. మరో రెండు రోజుల్లో ఇంగ్లాండ్ వేదిక జరగనున్న ఈ మెగాటోర్నీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి రికార్డులు సృష్టించే వీరులేవరో... కప్ కొట్టే జట్టేదో వేచిచూడాలి.
ఇదీ చూడండి : క్రికెట్ 'దేవుడి' కల నెరవేరిన వేళ