ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ల స్థానానికి కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో రెండో ఓపెనర్‌గా వీరిద్దరిలో ఎవరిని తీసుకుంటారో అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. అయితే ఈ అంశంపై స్పందించాడు భారత మాజీ ఆటగాడు, మాజీ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్. తాను సెలక్టరైతే కేఎల్ రాహుల్‌నే తుదిజట్టులోకి తీసుకుంటానని చెప్పాడు.
"శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌లో ప్రదర్శనను లెక్కలోకి తీసుకోకూడదు. నేను సెలక్టర్నైతే ధావన్‌ను టీ20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకోను. రాహుల్, ధావన్ మధ్య పోటీనే లేదు. మ్యాచ్ విన్నర్ ఒక్కరే ఉంటారు." - కృష్ణమాచారి శ్రీకాంత్, టీమిండియా మాజీ ఓపెనర్
గతేడాది ధావన్ 12 టీ20ల్లో 110.56 స్ట్రైక్ రేట్‌తో 272 పరుగులు చేయగా.. ఇదే సమయంలో రాహుల్ 9 ఇన్నింగ్స్‌ల్లో 142.40 స్ట్రైక్ రేట్‌తో 356 పరుగులు చేశాడు. రెండు నెలల విరామం తర్వాత జట్టులోకి పునరాగమనం చేస్తున్న శిఖర్.. ఇది తనకు నూతన ఆరంభమని చెప్పిన సంగతి తెలిసిందే.
గువాహటి వేదికగా ఆదివారం ప్రారంభం కావాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. మంగళవారం ఇండోర్‌లో శ్రీలంకతో రెండో మ్యాచ్ ఆడనుంది టీమిండియా.
ఇదీ చదవండి: ఐసీసీ నయా రూల్: నాలుగు రోజుల టెస్టు సాధ్యమేనా?