ఇటీవలే జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ సెమీస్ అది. భారత్-ఇంగ్లాండ్ జట్లు తలపడాలి. కానీ వర్షం అడ్డంకిగా నిలిచింది. ఎంతకీ తగ్గకపోవడం వల్ల మ్యాచ్‌ను క్యాన్సిల్ చేశారు. లీగ్ దశలో అత్యధిక పాయింట్లతో ఉన్న టీమిండియా, నేరుగా తుదిపోరుకు అర్హత సాధించింది. అయితే ఈ విధానం సరైంది కాదని, రిజర్వ్‌డే ఉండుంటే బాగుండేదని పలువురు క్రికెటర్లతో సహా మాజీలు అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు ఈ విషయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దృష్టిసారించింది. వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచకప్‌లో ఇలా జరగకుండా చూసేందుకు నిర్ణయించుకుంది. ఫైనల్లో పాటు సెమీస్‌కూ రిజర్వ్‌డే ఉంటుందని స్పష్టం చేసింది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు 5.5 మిలియన్ల న్యూజిలాండ్ డాలర్లు ఇవ్వనున్నారు.
ఈ టోర్నీలో జరిగే 31 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసింది ఐసీసీ. న్యూజిలాండ్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 వరకు జరగనుంది. మూడు నాకౌట్ మ్యాచ్‌లకు తర్వాతి రోజులను రిజర్వ్‌డేగా ప్రకటించింది.
ఇప్పటికే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లు ఈ ప్రపంచకప్‌నకు అర్హత సాధించాయి. మిగతా నాలుగు స్థానాల కోసం క్వాలిఫయింగ్ టోర్నీ.. ఈ జులైలో శ్రీలంకలో జరగనుంది.