చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో ఇంగ్లాండ్ తీసుకున్న నిర్ణయాలపై మాజీలతో పాటు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆధిక్యం 400 పరుగులు దాటిన తర్వాత ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తుందని భావించారంతా. కానీ ఇంగ్లాండ్ బ్యాటింగ్ కొనసాగించింది. అయితే దూకుడుగా ఆడి మరిన్ని పరుగులు చేసి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలనే ఆలోచనతో బ్యాటింగ్ చేస్తుందని అనుకున్నారంతా.
కానీ ఇంగ్లాండ్ దానికి విరుద్ధంగా నిదానంగా ఆడుతూ ఓవర్లను వృథా చేసింది. అసలు డిక్లేర్ చేయాలనే ఆలోచనే లేదన్నట్లుగా ఆడింది. మొత్తంగా అశ్విన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ 178 పరుగులకు కుప్పకూలడం వల్ల.. భారత్‌కు 420 పరుగుల లక్ష్యమని తేలింది. అయితే ఇంగ్లాండ్ డిక్లేర్ చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని క్రికెట్ ప్రపంచం చర్చిస్తోంది. అవేంటో ఓ సారి చూద్దాం..
2008 ఓటమి సీన్ రిపీట్ అవ్వొద్దనా?
2008లో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు ఇంగ్లాండ్‌కు పీడకలలా మారింది. 387 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా అద్భుత పోరాటంతో టీమ్ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆట ఆఖరి రోజు సెహ్వాగ్ (83) విధ్వంసకర బ్యాటింగ్ చేయగా సచిన్ (103*), యువరాజ్ (85*) సమయోచిత ఇన్నింగ్స్ ఆడారు. ఆ విజయంతో భారత్ రికార్డు సృష్టించింది. స్వదేశంలో అత్యధిక ఛేదనగా నిలిచింది. అంతకుముందు 1987లో వెస్టిండీస్ సాధించిన 276 పరుగులే అత్యధికం. అయితే మరోసారి అలాంటి పరాభవం ఎదురుకాకూడదని ఇంగ్లాండ్ భావించి ప్రస్తుత టెస్టులో డిక్లేర్ ఇవ్వలేదని విశ్లేషకులు అంటున్నారు.
![team india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10549971_rk-3.jpg)
పంత్ కారణమా?
గబ్బా టెస్టులో భారత్ సాధించిన చారిత్రక విజయమూ ఒక కారణమని భావిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టులో టీమ్ఇండియా 328 పరుగులు ఛేదించి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. పంత్ (89*) వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. మరోసారి భారత్ అలాంటి ఘనత సాధిస్తుందేమోననే సందేహంతో ఆలౌటయ్యే వరకు ఇంగ్లాండ్ ఆడిందని అంటున్నారు. అంతేగాక తొలి ఇన్నింగ్స్‌లో పంత్ (91) బ్యాటింగ్ చూసి 400 లక్ష్యం కూడా భారత్‌కు సరిపోదని భావించి ఉంటారని విశ్లేషిస్తున్నారు. 73/4తో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ దూకుడుగా ఆడుతూ పరుగులు సాధించాడు.
![panth](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10549971_rk-2.jpg)
కైల్ మేయర్స్ గుర్తొచ్చా?
బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ ఆదివారం అద్భుత విజయం సాధించింది. 395 పరుగుల లక్ష్యాన్ని విండీస్ ఛేదించి రికార్డు సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో అయిదో అత్యధిక లక్ష్య ఛేదన, ఆసియాలో అతి పెద్ద ఛేదనగా నమోదు చేసింది. తొలి టెస్టు ఆడుతున్న కైల్ మేయర్స్ డబుల్ సెంచరీ (210*) సాధించి జట్టును గెలిపించాడు. అయితే బంగ్లా పరిస్థితి తమకు రావొద్దని ఆలోచించి ఇంగ్లాండ్ డిక్లేర్ చేయలేదని విశ్లేషకులు అంటున్నారు.
![kayle](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10549971_rk-1.jpg)
ఇదీ చూడండి: తొలి టెస్ట్: 39/1 వద్ద భారత్- చివరి రోజు లక్ష్యం 381