కరోనా కారణంగా మార్చి నుంచి ఇళ్లకే పరిమితమైన భారత ఆటగాళ్లు.. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో టాప్-10లో అందరూ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. మూడు నెలల తర్వాత సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో నెగ్గింది వెస్టిండీస్ జట్టు. ఈ మ్యాచ్‌లో 7 వికెట్లు సాధించాడు కరీబియన్ పేసర్ జేసన్ హోల్డర్. ఇందులో తొలి ఇన్నింగ్స్‌లోనే 42 పరుగులిచ్చి 6 వికెట్ల హౌల్ ఖాతాలో వేసుకున్నాడు.
ఈ ప్రదర్శన దెబ్బకు 862 పాయింట్లకు చేరిన ఇతడు.. కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్ నమోదు చేసుకున్నాడు. గత 20 ఏళ్లలో ఏ విండీస్ క్రికెటర్ ఈ స్థాయి పాయింట్లను అందుకోలేకపోయారు. ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు హోల్డర్. 2000వ సంవత్సరంలో కోర్ట్నే వాల్ష్ 866 పాయింట్లు సాధించాడు. ఇదే ఇప్పటివరకు అత్యుత్తమం.
టెస్టు బ్యాట్స్‌మెన్ జాబితాలో స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ రెండో స్థానంలోనూ, పుజారా, రహానే 7, 9 ర్యాంక్‌ల్లో ఉన్నారు. బ్యాటింగ్‌లోనూ హోల్డర్ 35వ స్థానానికి చేరాడు. అంతేకాకుండా ఆల్‌రౌండర్ల జాబితాలోనూ 485 పాయింట్లతో టాప్‌లో దూసుకెళ్తున్నాడు. 431 పాయింట్లతో ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇద్దరి మధ్య 54 పాయింట్లే అంతరం ఉంది. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా 7వ స్థానంలో ఉన్నాడు.
ఇంగ్లాండ్ ఆటగాళ్లు రోరీ బర్న్స్ టాప్-30లో నిలవగా.. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ జాక్ క్రావ్లే టాప్-100లో నిలిచాడు. విండీస్ బౌలర్లలో షన్నాన్ గాబ్రియేల్ 46 పాయింట్లు మెరుగుపర్చుకొన్నాడు. తొమ్మిది వికెట్లు తీసిన ఇతడు 18వ స్థానంలో ఉన్నాడు. అద్భుతమైన ప్రదర్శన చేసిన జర్మైన్ బ్లాక్‌వుడ్ 14 స్థానాలు ఎగబాకి 58వ ర్యాంక్‌లో నిలిచాడు. షేన్ డౌరిచ్ 37వ స్థానానికి చేరాడు.