బీసీసీఐ నూతన రాజ్యాంగాన్ని సవరించేందుకు రంగం సిద్ధమైంది. ఆచరణ యోగ్యంగా లేని నిబంధనలను మారుస్తామని బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ చెప్పారు. 70 ఏళ్ల వయోపరిమితిని అలాగే ఉంచుతామని అన్నారు. పదవుల మధ్య విరామం (కూలింగ్ ఆఫ్ పీరియడ్) నిబంధనపై బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో చర్చిస్తామని స్పష్టం చేశారు.
కూలింగ్ ఆఫ్ పీరియడ్‌కు సవరణ
వయో పరిమితిని అలాగే ఉంచుతున్నాం. పదవుల మధ్య విరామాన్ని సవరించే అంశంపై దృష్టిపెట్టాం. రాష్ట్ర సంఘంలో ఆరేళ్లు అనుభవమున్న వ్యక్తికి విరామం ఎందుకివ్వాలనేది మా ఉద్దేశం. క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా ఆ అనుభవాన్ని బీసీసీఐలో ఎందుకు ఉపయోగించుకోవద్దు? విరామం ముందు అధ్యక్షుడు, కార్యదర్శిని వరుసగా రెండు దఫాలు, కోశాధికారి, ఇతర పాలకులను ఒకేసారి మూడు దఫాలు (9 ఏళ్లు) కొనసాగిస్తే బాగుటుందని బీసీసీఐ కోరుకుంటోంది.
గంగూలీకే మొదట ప్రయోజనం
ప్రస్తుత నిబంధనల ప్రకారం గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడిగా కేవలం 10 నెలలు మాత్రమే పదవిలో ఉండాలి. ఎందుకంటే ఆయన బంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా నాలుగున్నరేళ్లకు పైగా పనిచేశారు. ఇప్పుడు నిబంధన సవరిస్తే తొలి ప్రయోజనం ఆయనకే చేకూరుతుంది.
రాష్ట్రాల్లో అనుభవజ్ఞులను ఉపయోగించుకుంటాం
గత ఎన్నికల్లో భాగమైన 38 మందిలో కేవలం నలుగురైదుగురికే సమావేశాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. అలాంటప్పుడు రాష్ట్ర సంఘాల్లో అనుభవం ఉన్నవారిని బీసీసీఐలో ఉపయోగించుకుంటే మంచిది. లోధా సిఫార్సుల ప్రకారమైతే ఒకేసారి అన్ని రాష్ట్రాల్లో ఉన్నవారిని అనర్హులుగా ప్రకటించాలి.
సుప్రీంకోర్టుకు సమర్పిస్తాం
సవరించిన నిబంధనలు సుప్రీం కోర్టుకు సమర్పిస్తాం. మూకుమ్మడిగా అన్ని నిర్ణయాలు మేమే అమలు చేయం. 'ఒక రాష్ట్రం ఒక ఓటు' లాంటి రూల్స్‌ను గతంలో సుప్రీం కోర్టే సవరించింది. ఆచరణ యోగ్యం కాని వాటినే సవరించాలని భావిస్తున్నాం. సీఓఏ కూడా పరస్పర విరుద్ధ ప్రయోజనాలపై ఇలాగే వ్యవహరించింది.
పింక్ టెస్టు విజయవంతమైంది..
ప్రయోగాత్మకంగా నిర్వహించిన డేనైట్ టెస్టు విజయవంతమైంది. మంచు ప్రభావం, మైదానం, ఆడే కాలాన్ని బట్టి మున్ముందు గులాబి బంతి మ్యాచుల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటాం. అన్ని సంఘాలను అడిగి ఒక విధాన నిర్ణయం తీసుకుంటాం.
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ ఎంపికైన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే కావడం విశేషం. జస్టిస్ ఆర్‌ఎం లోధా సిఫార్సుల ప్రకారం ఏ పాలకుడైనా రాష్ట్రంలో లేదా బీసీసీఐలో రెండు దఫాలు (ఆరేళ్లు) పనిచేసిన తర్వాత మూడేళ్లు కచ్చితంగా విరామం తీసుకోవాలి.
ఇదీ చదవండి: క్రికెటర్ ఆర్చర్‌పై వర్ణ వివక్ష.. కివీస్ బోర్డు క్షమాపణలు