సొంతగడ్డపై గత భారత సిరీస్‌తో పోలిస్తే ప్రస్తుత ఆస్ట్రేలియా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉందని ఆ జట్టు సీనియర్ స్పిన్నర్ నాథన్ లైయన్ అన్నాడు. 2018 సిరీస్‌లో టీమ్‌ఇండియా చేతిలో కంగారూలు 1-2తో ఓడిన నేపథ్యాన్ని గుర్తు చేస్తూ అతనిలా అన్నాడు.
"భారత్‌తో రెండేళ్ల క్రితం ఆడిన సిరీస్‌లో ఏం జరిగిందో ప్రత్యర్థి ఎంతబాగా ఆడిందో అందరికి తెలుసు. కానీ ఈసారి టెస్టు సిరీస్‌లో భిన్నమైన ప్రణాళికలతో బరిలో దిగుతున్నాం. ఆసీస్ ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. గత సిరీస్‌తో పోలిస్తే మా జట్టు ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. నేను ఆడిన ఆసీస్ జట్లలోకెల్లా ఇదే బలమైందని భావిస్తున్నా. గాయం కారణంగా వార్నర్ లాంటి నాణ్యమైన ఆటగాడిని కోల్పోయినా.. టీమ్‌ఇండియాపై సత్తా చాటేందుకు గట్టిగా కసరత్తులు చేశాం" అని లైయన్ చెప్పాడు.
స్నేహితుడు మిచెల్ స్టార్క్ తిరిగి ఆసీస్ జట్టులో చేరడం చాలా ఆనందాన్నిస్తోందని ఈ ఆఫ్ స్పిన్నర్ పేర్కొన్నాడు. "సాధారణంగా వీలైనంత ఎక్కువగా బంతిని ఎడ్జ్ తీసుకునేలా బౌలింగ్ చేస్తా. స్టార్క్ బౌలింగ్ చేసే క్రమంలో ఏర్పడే పాదముద్రలు ఇందుకు ఉపయోగపడతాయి. అతను నాణ్యమైన బౌలర్. టెస్టులకు స్టార్క్ పెద్దగా సిద్ధం కాకపోయినా.. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడాడు.. గులాబి బంతితో మిచెల్ ఎంతటి ప్రభావం చూపిస్తాడో మాకు తెలుసు. భారత బ్యాటింగ్‌ను సవాల్ చేసే బౌలింగ్ లైనప్ ఆసీస్‌కు ఉంది" అని లైయన్ అన్నాడు.
ఇదీ చూడండి : 4 రోజుల టెస్టులను వ్యతిరేకిస్తున్నా: నాథన్ లయన్